- సాధ్యమైనంత నీటిని వినియోగించుకునేలా చర్యలు
- భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయానికి కేంద్రం జోక్యం చేసుకోవాలి
- ఆర్డీఎస్ బాధితుల దశాబ్దాల గోస తీరాలి
- నిలిచిపోయిన ఆర్డీఎస్ ప్యాకేజీలను వెంటనే పట్టాలెక్కించండి
- కర్నాటక సహకారంతో ఆర్డీఎస్ పూడికతీతకు సిద్ధం కండి
- తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై
- ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
- నేడు తుంగభద్ర డ్యామ్ కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవానికి రేవంత్
- కర్నాటక సీఎం ఆహ్వానం మేరకు వెళ్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి.. భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర డ్యామ్, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, ఇప్పుడు అయిదారు టీఎంసీలకు మించి రావడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్డీఎస్ కింద జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉందన్నారు. మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్నాటక నీటి వాటాల సమర్ధ వినియోగానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సారథ్యంలో తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలని కోరారు. బుధవారం సాయంత్రం జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించాలని కోరారు. రాజోలి బండ డైవర్సన్ కెనాల్ ఆధునీకరణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 59 కోట్లు డిపాజిట్ చేసిందని, పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. ప్యాకేజీ 1,2 పనులు ఇప్పటికీ చేపట్టలేదని, ప్యాకేజీ 3, 4 పనులు మాత్రం పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. నిలిచిపోయిన మొదటి రెండు ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని గురువారం కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ముగ్గురు సీఎంలతో జరిగే సమావేశం లో ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు.
ఆర్డీఎస్ వద్ద తెలంగాణ భూభాగం వైపు పూడిక తీయాలి..
ఆర్డీఎస్ వద్ద తెలంగాణ భూభాగం వైపు పూడిక నిండిపోవడం వల్ల ఆశించిన విధంగా నీటి మళ్లింపు సాధ్యం కావడం లేదని ఇంజనీర్లు సీఎంకు దృష్టికి తీసుకెళ్లారు. 2004 లో నిపుణుల కమిటీ పూడిక తొలిగించాలని సూచించింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులు ఇప్పటికీ అమలు కాలేదని చర్చ జరిగింది. వెంటనే పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. పూడిక పేరుకున్న భూభాగం కర్నాటకలో ఉండడంతో ఆ రాష్ట్ర సహకారం కోరాలని నిర్ణయం తీసుకున్నారు.
పూడికతీతతో పాటు 2004లో నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను అమలు చేయాలని కేంద్రానికి వినతిపత్రం అందించాలని సీఎం సూచించారు. అప్పటి నివేదికకు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితిని విశ్లేషించుకోవాలన్నారు. వెంటనే పూర్తి వివరాలతో నివేదికను తయారు చేయాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకంలో భాగంగా సాధ్యమైనంత నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని సీఎం అదేశించారు.
తుమ్మిళ్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ పెంచాలని, వీలైనంత వేగంగా పనులను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న ఆర్డీఎస్ బాధిత రైతులు
ఆర్డీఎస్ పరిధిలోని ఆయకట్టు రైతుల దశాబ్దాల గోస తీర్చేందుకు సీఎం ముందుకురావడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం జలసౌధలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి ఆర్డీఎస్ బాధిత రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సమావేశానికి రైతులను పిలిపించి మాట్లాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను సీఎంకు ఏకరువు పెడుతూ వినతిపత్రాలు సమర్పించగా.. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక సీఎంలతో మాట్లాడి ఆర్డీఎస్ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం భరోసా ఇచ్చారు.
నేడు కర్నాటకకు సీఎం రేవంత్ రెడ్డి
కర్నాటకలోని విజయనగర జిల్లా హోసపేటలో ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు సీఎం రేవంత్ రెడ్డి గురువారం వెళ్లనున్నారు. తుంగభద్ర జలాశయంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. గురువారం ఉదయం 11 గంటలకు హోసపేట చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి.. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఈ ఆధునీకరించిన గేట్లను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం విజయనగర జిల్లా మునిరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ ‘ప్రజా సభ’కు సీఎం హాజరై ప్రసంగించనున్నారు.
