హైదరాబాద్ పేరు మారుస్తాం

హైదరాబాద్ పేరు మారుస్తాం

హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతున్న ప్రముఖులు చార్మినార్ ​భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శనకు వస్తున్నారు. ముఖ్య నేతలు అమ్మవారి దర్శనం కోసం రానుండటంతో ఆలయాన్ని రంగు రంగుల పుష్పాలు, తోరణాలతో అలంకరించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే హైదరాబాద్ పేరు మారుస్తామని యూపీ డిప్యుటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.

ఇయ్యాల భాగ్యలక్ష్మి గుడికి యోగి
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం పొద్దున 6గంటలకు దర్శనం చేసుకోనున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం యోగి శనివారం ఉదయం అమ్మవారి ఆలయానికి రావాల్సి ఉండగా... టైమ్​సర్దుబాటవక సందర్శన వాయిదా పడిందని వివరించారు. అయితే యూపీ సీఎం వస్తున్నారని తెలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం కనిపించింది. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద కేంద్ర బలగాలను సైతం మోహరించారు.  మున్సిపల్ ఎన్నికల ప్రచారం సమయంలోనూ కొన్ని కారణాల వల్ల దర్శనం వాయిదా పడిందని, కానీ బండి సంజయ్ తోపాటు పలువురు పార్టీ ముఖ్య నేతల ఆహ్వానం మేరకు యోగి ఆలయానికి రావాలని నిర్ణయించుకున్నారు.

బీహార్ డిప్యూటీ సీఎం పూజలు
ఓల్డ్ సిటీలోని అమ్మవారి టెంపుల్ ను  బీహార్ డిప్యూటీ సీఎం తార్ కిశోర్ ప్రసాద్ సందర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో దేశంలో సరైన దిశగా పాలన సాగుతోందన్నారు.