అమెరికన్లను సముద్రంలో కలిపేస్తం.. ఆ దేశం ఓ పెద్ద సైతాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా

అమెరికన్లను సముద్రంలో కలిపేస్తం.. ఆ దేశం ఓ పెద్ద సైతాన్:  ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా
  • మా అణు, క్షిపణి సామర్థ్యాలను కాపాడుకుంటం
  • మా కొత్త వెపన్​తో.. వారికి హార్ట్ ఎటాకే: ఇరాన్ నేవీ కమాండర్
  • హార్మూజ్​పై నియంత్రణతో పర్షియన్​ గల్ఫ్​ సురక్షితమని వెల్లడి

టెహ్రాన్: ఇరాన్ తన అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తిగా కాపాడుకుంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటరైతే అమెరికన్లను సముద్రంలో కలిపేస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ ప్రాంత చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోందన్నారు. గురువారం ఇరాన్‌‌‌‌‌‌‌‌లో పర్షియన్ గల్ఫ్ డే సందర్భంగా మొజ్తబా లిఖితపూర్వక ప్రకటనను ప్రభుత్వ టీవీ చానెల్ యాంకర్ చదివి వినిపించారు. 

"దేవుని సహాయం, శక్తితో పర్షియన్ గల్ఫ్ ప్రాంతం భవిష్యత్తు అమెరికా పాత్ర లేనివిధంగా ఉంటుంది. అది ఇక్కడి ప్రజల పురోగతికి, శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది" అని మొజ్తబా తన ప్రకటనలో పేర్కొన్నారు. "పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లోని మేము, మా పొరుగు దేశాలు ఇక్కడ ఉమ్మడి భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాం. 

వేల కిలోమీటర్ల దూరం నుంచి దురాశ, దుర్బుద్ధితో వచ్చే విదేశీయులకు సముద్రగర్భంలో తప్ప, ఇక్కడ చోటు లేదు" అని ఆయన అన్నారు. "నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు, క్షిపణి సామర్థ్యాల వరకు ఇరాన్ ఆధ్యాత్మిక, మానవీయ, శాస్త్రీయ, పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాలన్నింటినీ 9 కోట్ల మంది ఇరానియన్లు జాతీయ ఆస్తులుగా భావిస్తారు. దేశ జలాలను, భూమిని, గగనతలం మాదిరే వీటినీ కాపాడుకుంటారు" అని మొజ్తబా స్పష్టం చేశారు. 

అమెరికా ఒక పెద్ద సైతాన్ అని ఆయన అభివర్ణించారు. ‘హార్మూజ్ పై నియంత్రణతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని ఇరాన్ సురక్షితంగా మారుస్తుంది. ఈ జలమార్గాన్ని శత్రువు దుర్వినియోగం చేయకుండా అడ్డుకుంటుంది’ అని పేర్కొన్నారు. కాగా, హార్మూజ్ జలసంధిని ప్రపంచ దేశాలు అంతర్జాతీయ జలమార్గంగా పరిగణిస్తాయి. ఇది ఎటువంటి సుంకాలు చెల్లించకుండా అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతున్నాయి. యూఏఈ వంటి గల్ఫ్ అరబ్ దేశాలు ఈ జలసంధిపై ఇరాన్ నియంత్రణను 
సముద్రపు దొంగతనంగా అభివర్ణించాయి.

  • మా కొత్త వెపన్​తో.. వారికి హార్ట్ ఎటాకే

అమెరికా, ఇజ్రాయెల్ పై యుద్ధంలో తాము చాలా త్వరలోనే ఒక కొత్త ఆయుధాన్ని ప్రయోగించబోతున్నామని ఇరాన్ నేవీ కమాండర్ రియర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ హెచ్చరించారు. ఈ ఆయుధం పేరు వింటేనే శత్రు దళాలు తీవ్రంగా భయపడతాయని, అది వారికి గుండెపోటును తెప్పిస్తుందన్నారు.  "ఆ ఆయుధం వారి పక్కనే ఉంది.. అది చూసి వారికి గుండెపోటు రాకూడదని నేను ఆశిస్తున్నా" అని ఆయన వ్యాఖ్యానించారు. 

హార్మూజ్ జలసంధి ద్వారా జరుగుతున్న చమురు వ్యాపారాన్ని అడ్డుకోవడం, ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్ ను చర్చల వేదిక వద్దకు తీసుకురావాలన్న ట్రంప్ వ్యూహాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌పై కావాలని చేస్తున్న ఈ దురాక్రమణ ద్వారా అనుకున్న ఫలితాలను చాలా త్వరగా సాధించవచ్చని శత్రువులు తప్పుగా భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. "వారి ఆ అంచనా ఇప్పుడు మిలిటరీ అకాడమీల్లో ఒక జోక్‌‌‌‌‌‌‌‌గా మారిపోయింది" అని సెటైర్ వేశారు. 

అంతేకాకుండా, అమెరికా విమానవాహక నౌక అబ్రహం లింకన్ పై ఇరాన్ దళాలు కనీసం ఏడు క్షిపణి ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనివల్ల అమెరికా కొంతకాలం పాటు ఆ నౌక నుంచి యుద్ధ విమానాలను టేకాఫ్ చేయలేకపోయిందని ఆయన వెల్లడించారు. మరోవైపు, ఈ దిగ్బంధానికి త్వరలోనే ఆచరణాత్మకమైన, మునుపెన్నడూ లేని స్థాయిలో సమాధానం ఇస్తామని ఇరాన్ భద్రతా వర్గాలు హెచ్చరించాయి.