ఎఫ్​పీఓ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం... : గౌతమ్​ అదానీ

ఎఫ్​పీఓ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం... : గౌతమ్​ అదానీ

వెలుగు బిజినెస్​ డెస్క్​: అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ షేరు ధర దారుణంగా పడిపోతుండటంతో ఫాలో ఆన్​ పబ్లిక్​ఆఫరింగ్​ (ఎఫ్​పీఓ) డబ్బులు ఇన్వెస్టర్లకు  వెనక్కి ఇచ్చేయనున్నట్లు  అదానీ గ్రూప్ చైర్మన్​ గౌతమ్​ అదానీ ప్రకటించారు. ​ బుధవారం జరిగిన డైరెక్టర్ల బోర్డు మీటింగ్​లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యమైన పరిణామాలు, మార్కెట్లో ఒడిదుడుకుల  నేపథ్యంలో, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ఎఫ్​పీఓ డబ్బు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించామని, ఈ ట్రాన్సాక్షన్​ మొత్తాన్ని ఉపసంహరించుకుంటున్నామని అదానీ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ ఒక స్టేట్​మెంట్లో తెలిపింది.  షేర్ల ధరలు ఆగకుండా పడిపోతున్న కారణంగా ఎఫ్​పీఓతో ముందుకు వెళ్లడం నైతికంగా సరైనది కాదని డైరెక్టర్ల బోర్డు భావించినట్లు గౌతమ్​ అదానీ వెల్లడించారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలే తమకు ఎల్లప్పుడూ ముఖ్యమని, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకే ఎఫ్​పీఓతో కొనసాగరాదనే నిర్ణయానికి బోర్డు వచ్చిందని చెప్పారు. రిటెయిల్​ ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నా, అదానీ ఎంటర్​ప్రైజస్​ ఎఫ్​పీఓ రూ. 20 వేల కోట్లు సమీకరించడంలో సక్సెసయింది. నాన్​ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు, హైనెట్​వర్త్​ ఇండివిడ్యువల్స్​కి చెందిన ఫ్యామిలీ ఆఫీసులు మద్దతుగా రావడం వల్లే ఈ ఎఫ్​పీఓ సక్సెస్​ సాధించింది. ఎఫ్​పీఓ ఫండ్స్​ను తిరిగి ఇచ్చేందుకు బుక్​ రన్నింగ్​ లీడ్​ మేనేజర్స్​తో కలిసి పనిచేస్తున్నట్లు అదానీ ప్రకటించారు. అమెరికన్​ షార్ట్​ సెల్లర్​ హిండెన్​బర్గ్​ రిపోర్టుతో అదానీ ఎంటర్​ప్రైజస్​ ఎఫ్​పీఓ ఇబ్బందులెదుర్కొన్న విషయం తెలిసిందే. 

సెబీ పరిశీలనలో అదానీ...రాయిటర్స్​ రిపోర్టు

ఎఫ్​పీఓలో అవకతవకలు ఏవైనా జరిగాయా అనే అంశాన్ని , షేర్ల పతనం ఎందుకనే విషయాన్నీ  సెబీ పరిశీలిస్తోందని బుధవారం రాయిటర్స్​ ఒక రిపోర్టు పబ్లిష్​ చేసింది. గత అయిదు ట్రేడింగ్​ సెషన్లలోనూ కలిపి అదానీ గ్రూప్​లోని 10 లిస్టెడ్​ కంపెనీలూ రూ. 7.5 లక్షల కోట్ల మార్కెట్​ విలువను పోగొట్టుకున్నాయి. ఒక్క అదానీ ఎంటర్​ప్రైజస్​నే చూస్తే 50 శాతం నష్టపోయి 52 వారాల కనిష్టానికి చేరింది. దీంతో  కొన్నేళ్లపాటు సాగిన ర్యాలీకి బ్రేకు పడింది.

అదానీ గ్రూప్​లోని కంపెనీల షేర్లకు అంత విలువ అవసరం లేదని, వాటి ధరలు ఉండాల్సిన దానికన్నా 85 శాతం ఎక్కువగా ఉన్నాయనే సంచలన ఆరోపణలను హిండెన్​బర్గ్​ చేసింది. మా బాలెన్స్​ షీట్​ పటిష్టంగా ఉంది. క్యాష్​ ఫ్లోకు కూడా ఇబ్బంది లేదు. అప్పులపై వడ్డీలు చెల్లించడంలో మాకు మంచి ట్రాక్​ రికార్డు ఉంది. మా ఆపరేషన్స్​పై లేదా ఫ్యూచర్​ ప్లాన్లపై  తాజా డెసిషన్​ ఎఫెక్ట్​ ఏమీ ఉండదు. లాంగ్​ టర్మ్​ వాల్యూ క్రియేషన్​పై ఫోకస్​ కొనసాగుతుంది. ఇంటర్నల్ అక్రూవల్స్​ నుంచే గ్రోత్​ సాధిస్తాం. మార్కెట్​ సాధారణ స్థితికి వచ్చాక క్యాపిటల్​ మార్కెట్​ స్ట్రేటజీని రివ్యూ చేస్తాం.

-గౌతమ్​ అదానీ