
- గెలిచాక బహుజనుల గొంతుకవుతం
- బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్
మునుగోడు, వెలుగు: మునుగోడు ప్రజలు కుట్రలను పసిగడుతున్నారని, నీలి జెండా ఎగరవేస్తారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 99 శాతం ప్రజల ప్రతినిధిగా తమ అభ్యర్థి శంకరాచారి నిలబడ్డారని, గెలిచాక బహుజనుల గొంతుకై ప్రశ్నిస్తారని చెప్పారు. శంకరాచారి గెలిస్తే విద్య, వైద్యం, ఉపాధి అందేలా కృషి చేస్తారని తెలిపారు. మునుగోడు మండల కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు.గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు తమ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నా భయపడకుండా పోరాడుతున్నారని చెప్పారు.
ఆధిపత్య పార్టీలకు బహుజనులు ఓటేయకుంటే డిపాజిట్ కూడా దక్కదన్నారు. అందుకే బహుజనులను విడదీసే కుట్ర చేస్తున్నారన్నారు. మునుగోడు యుద్ధంలో పేదలే గెలుస్తారని చెప్పారు. శ్రమజీవులంతా పార్టీలకు అతీతంగా ఒక్కటై బీఎస్పీ గురించి ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఆధిపత్య పార్టీలు ఊరూరా మద్యం పంచుతున్నాయని, స్వయంగా మంత్రులే మద్యం పంచడం దారుణం అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు.
ఈ నెల 29న బీఎస్పీ భారీ బహిరంగ సభ ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సిద్ధార్థ ఫూలే, నిశాని రాంచందర్, మహిళా నాయకురాలు నిర్మల,శిరీష,జిల్లా నాయకులు భీం ప్రసాద్, మండల నాయకులు వెంకట్, హరీశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.