
- గోదావరిఖనిలో అనాథ పిల్లలతో కలిసి ఆశ్రమ నిర్వాహకుడి ఆందోళన
గోదావరిఖని, వెలుగు : అనాథ ఆశ్రమ నిర్వహణకు 10 గుంటల భూమి ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా ఆఫీసర్లు పట్టించుకోకుండా రూ. 10 లక్షలు లంచం అడుగుతున్నారంటూ మంథని డివిజన్ హ్యాండీక్యాప్ట్ వెల్ఫేర్ సొసైటీ ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య ఆరోపించారు. ఈ మేరకు సోమవారం అనాథ పిల్లలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ 2017లో అప్పటి కలెక్టర్ దేవసేన తమ ఆశ్రమానికి వచ్చి, గోదావరిఖని బస్టాండ్‌కు వెళ్లే దారిలోని సర్వే నంబర్ 706లో ఉన్న పది గుంటల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని సింగరేణికి లేఖ రాశారని గుర్తు చేశారు.
ఆ స్థలంలో తమ ఆశ్రమం కోసం షెడ్ నిర్మిస్తే సింగరేణి ఆఫీసర్లు వచ్చి ధ్వంసం చేశారని వాపోయారు. ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లగా... ఆశ్రమానికి 10 గుంటల స్థలం ఇవ్వాలని ఆదేశించిందని గుర్తు చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ ముజమ్మీల్‌ఖాన్ స్థలం ఇచ్చేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారని, ఆయన ట్రాన్స్‌ఫర్ కావడంతో ఫైల్ ముందుకు కదలడం లేదన్నారు. స్థలం కోసం జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్‌ను కలిసే ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
జూన్‌లో ఆఫీసర్‌ను కలువగా.. ‘అంత జాగ ఊరికే ఇస్తారా.. హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ కావాలంటే రూ.10 లక్షలు తీసుకురా.. అప్పుడే నీ పని చేయమని కలెక్టర్ చెప్పిండు.. లేదంటే కోర్టుకు వెళ్లి వాళ్లనే స్థలం ఇవ్వమని అడుక్కో’ అంటూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా ఉన్నతాధికారులే డబ్బులు అడిగితే.. తమకు న్యాయం ఎవరు చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయమై సీఎంతో పాటు ఢిల్లీలోని వికలాంగుల హక్కుల కమిషన్, రామగుండం సీపీని కలుస్తానని చెప్పారు. పలువురు కాలనీవాసులు రాజయ్యకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.