కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్న క్రమంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన చరాస్తులను సుమారు రూ. 15.37 లక్షలుగా ప్రకటించారు. 2021లో ఎన్నికల సమయంలో కంటే ఆమె ఆస్తి రూ. 1.3 లక్షలు తగ్గడం గమనార్హం.
అంతేకాదు.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రికి ఎలాంటి అప్పులు లేవు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదని అఫిడవిట్లో ఎన్నికల సంఘానికి ఆమె తెలియజేశారు. ఆమెకు స్థిరాస్తులు కూడా లేవని అఫిడవిట్లో తెలిపారు. ఆమె తన మొత్తం చరాస్తుల విలువ రూ. 15,37,509.71 అని పేర్కొన్నారు. 2021లో రూ. 69,255గా ఉన్న మమతా బెనర్జీ చేతిలోని నగదు ఇప్పుడు రూ. 75,700కు పెరిగింది.
ఆమె ఆస్తులలో బ్యాంకు డిపాజిట్లు రూ. 12.7 లక్షలు. తన వద్ద రూ. 1.45 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని కూడా మమతా బెనర్జీ ప్రకటించారు. తన అఫిడవిట్‌లో, తనకు షేర్లు, బాండ్లు లేదా బీమా పాలసీలలో ఎలాంటి పెట్టుబడులు లేవని, తనకు సొంత వాహనం కూడా లేదని ఆమె పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి తన మొత్తం ఆదాయం రూ. 23.21 లక్షలు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల అఫిడవిట్లో స్పష్టం చేశారు.
Also Read : బాల్కనీలో ఆడుకుంటున్న పాప.. సడన్గా దడేల్మని శబ్దం
ఇక.. భవానీ పూర్ నుంచి మమతపై పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికల అఫిడవిట్ విషయానికొస్తే.. ఆయన తన చరాస్తులను 24.57 లక్షల రూపాయలుగా ప్రకటించారు. స్థిరాస్తులను రూ.61.30 లక్షలుగా ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. 2.46 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఒక ఇల్లు, ఒక ఫ్లాట్, ఇతర ఆస్తులన్నీ కలిపితే రూ.25 లక్షల విలువ ఉంటుందని వివరించారు. మమతా బెనర్జీలానే సువేందు అధికారికి కూడా ఎలాంటి అప్పులు లేవు. సొంత వాహనం కూడా లేదని ఎన్నికల అఫిడవిట్లో సువేందు అధికారి ఎన్నికల సంఘానికి వివరించారు.
