- జింబాబ్వేపై 254/6దంచిన కరీబియన్ టీమ్
- హెట్‌మయర్, పావెల్ ఫిఫ్టీలు
- 107 రన్స్ తో గ్రాండ్ విక్టరీ
ముంబై: టీ20 వరల్డ్ కప్‌లో డబుల్ చాంపియన్ వెస్టిండీస్ తన బ్యాట్ పవర్ చూపెట్టింది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన ఆ జట్టు సూపర్–8 రౌండ్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఫోర్లు, సిక్సర్లతో ‘రన్‌రంగం’ సృష్టించింది. ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి పెద్ద జట్లను ఓడించి జోరు మీదున్న జింబాబ్వే బౌలింగ్‌ను ఉతికేస్తూ షిమ్రన్ హెట్‌మయర్ (34 బాల్స్‌లో 7 ఫోర్లు, 7సిక్సర్లతో 85), రోవ్‌మన్ పావెల్ (35 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 59) దంచికొట్టారు. దాంతో మెగా టోర్నీలో సెకండ్ హయ్యెస్ట్ స్కోరు చేసిన కరీబియన్ టీమ్ వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన గ్రూప్–1 పోరులో 107 రన్స్ తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 254/6 స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్‌లో జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 రన్స్‌కే ఆలౌటై ఓడిపోయింది. గుడకేశ్ మోతీ (4/28), అకీల్ హుస్సేన్ (3/28) దెబ్బకు ఆ జట్టు వరుస వికెట్లు కోల్పోయింది. బ్రాడ్ ఎవాన్స్ (43), డియోన్ మైయర్స్ ( 28), సికందర్ రజా (27) పోరాడినా ఫలితం లేకపోయింది. హెట్‌మయర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
హెట్‌మయర్, పావెల్ సిక్సర్ల మోత
ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (9), షై హోప్ (14) ఫెయిలైనా.. వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చిన హెట్‌మయర్ జింబాబ్వే బౌలర్లను ఆడుకున్నాడు. క్రీమర్ వేసిన ఏడో ఓవర్లో రెండు సిక్సర్లు, రజా బౌలింగ్‌లో మూడు సిక్సర్లు కొట్టిన అతను కేవలం 19 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జింబాబ్వే ఫీల్డర్ ముసెకివా 9, 70 రన్స్ వద్ద హెట్‌మయర్ ఇచ్చిన క్యాచ్‌లను జారవిడవడం ఆ జట్టు పాలిట శాపంగా మారింది. ఈ లైఫ్ లైన్లను అందిపుచ్చుకున్న హెట్‌మయర్ వెనుదిరిగి చూడలేదు. అతనికి పావెల్ కూడా తోడయ్యాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 52 బాల్స్‌లోనే 122 రన్స్ జోడించారు. చివర్లో రూథర్‌ఫోర్డ్ (13 బాల్స్‌లో 31 నాటౌట్), రొమారియో (21), జేసన్ హోల్డర్ (13) ధాటిగా ఆడటంతో విండీస్ స్కోరు 250 మార్కును దాటింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గరావ, ముజరబానీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు: వెస్టిండీస్: 20 ఓవర్లలో 254/6 (హెట్‌మయర్ 85, పావెల్ 59, ముజరబానీ 2/42); జింబాబ్వే: 17.4 ఓవర్లలో 147 ఆలౌట్ (ఎవాన్స్ 43, మోతీ 4/28)
2 వెస్టిండీస్ స్కోరు (254/6) మెగా టోర్నీ చరిత్రలో ఇది సెకండ్ బెస్ట్. 2007లో ఐర్లాండ్‌పై శ్రీలంక అత్యధికంగా260/6 స్కోరు చేసింది.
19 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో అత్యధికంగా 19 సిక్సర్లు కొట్టిన టీమ్‌గా నెదర్లాండ్స్ (2014లో ఐర్లాండ్‌పై 19) రికార్డును విండీస్ సమం చేసింది.
