భూమిపై జీవానికి మూలం పిడుగులేనా?

భూమిపై జీవానికి మూలం పిడుగులేనా?

భూమి మీద జీవం పుట్టుకకు మూలం ఏంటి? అంటే ఆస్టరాయిడ్స్ వచ్చి భూమిని ఢీకొట్టడం ద్వారా అని కొన్ని థియరీలు చెబుతాయి. సముద్రాల్లో మొదలైందని కొన్ని, మంచు ఖండాల్లో నుంచి జీవం పుట్టిందని మరి కొన్ని థియరీలు ప్రతిపాదిస్తుంటాయి. అయితే ఇవేవీ కాదని కొన్ని వందల కోట్ల ఏండ్ల క్రితం భూమిపై జీవం పురుడు పోసుకోవడానికి పిడుగులే కిక్ స్టార్ట్‌‌లాగా ఉపయోగపడ్డాయని మరో స్టడీ చెబుతోంది. ఈ అంశంపై యూనివర్సిటీ ఆఫ్ యేల్స్, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ సైంటిస్టులు కలిసి చేసిన రీసెర్చ్‌‌లో ఈ విషయం వెల్లడైంది.

భూమిపై పుట్టిన తొలి జీవం ఎంతటి సూక్ష్మమైనదైనా దానిలో బయోమాలిక్యూల్స్ (జీవ అణువులు)  ఉంటాయి. డీఎన్‌‌ఏ, సెల్స్ (జీవ కణాలు) కచ్చితంగా ఉంటాయి. అయితే ఈ డీఎన్‌‌ఏ, కణాలు ఏర్పడడంలో చాలా కీలకమైనది ఫాస్ఫరస్. ఇది లేకుండా ఏ కణం ఏర్పడలేదు. భూమి మీద తొలిసారి జీవం ఏర్పడడానికి ఈ ఫాస్ఫరస్‌‌ను ట్రిగ్గర్ చేసింది పిడుగులేనని యూనివర్సిటీ ఆఫ్ యేల్స్, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ సైంటిస్టులు చెబుతున్నారు.  భూమి పొరల లోతుల్లో ఉన్న ఫాస్ఫరస్‌‌ బయటకు వచ్చి, వాతావరణంలోని ఇతర మూలకాల సాయంతో జీవం పుట్టుక జరగడానికి ఆకాశం నుంచి భూమిని తాకిన పిడుగులే కారణమని తమ రీసెర్చ్‌‌లో తేలిందని వివరిస్తున్నారు. ఇతర గ్రహాలపైనా జీవం ఉండే అవకాశాలపై జరిగే అధ్యయనాలకు ఈ ఫలితాలు ఉపయోగపడతాయని వారు అంటున్నారు.

క్విలియన్ పిడుగుల తాకిడి తర్వాత..

ఏదో ఒకటి రెండు సార్లు పిడుగులు పడడంతోనే జీవం పుట్టేయలేదు. భూమి పొరల లోతుల్లోనే జీవం పుట్టుకలో కీలకమైన ఫాస్ఫరస్ ఉన్నా అది కొన్ని బిలియన్ సంవత్సరాల పాటు బయటకు రాలేదు. సుమారు 350 నుంచి 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద జీవం పుట్టినట్టు ఒక అంచనా. అంతకంటే మరి కొన్ని కోట్ల ఏండ్ల క్రితం నుంచి పిడుగులు భూమిని తాకుతూ వచ్చాకే జీవం మొదలవ్వడానికి అవసరమైన ఫ్రీక్వెన్సీలో ఫాస్ఫరస్ ట్రిగ్గర్ అయిందని సైంటిస్ట్ బెంజమిన్ హెస్ తెలిపారు. ఆ పిడుగుల తాకిడి సంఖ్య వేల లక్షలాది కోట్లలో (క్విలియన్ అంటే ఒకటి పక్కన 30 సున్నాలు) జరిగిన తర్వాతే తొలి బయోమాలిక్యూల్‌‌కు బీజం పడిందని చెప్పారు.

అస్ట్రాయిడ్ థియరీ తప్పే..

జీవ కణాల్లో ఫాస్ఫరస్ ఒక్కటే కాదు. దానితో పాటు మరికొన్ని మూలకాలు కూడా కలవాల్సిందే. ఈ కలయిక జరగడానికి, జీవం పుట్టుకకు తొలుత ఆస్ట్రాయిడ్స్ (గ్రహ శకలాలు) అంతరిక్షం నుంచి భూమిని ఢీకొనడమే కారణమని శాస్త్రవేత్తలు భావించారు. ఇవి భూమిని ఢీకొన్నప్పుడు ఏర్పడే మినరల్ స్టోన్స్‌‌లో ఫాస్ఫరస్‌‌తో కూడిన ష్రైబర్‌‌‌‌సైట్ అనే గ్లాస్ మెటీరియల్ ఏర్పడుతుంది. గ్రహశకలాలు భూమిని ఢీకొన్న ఆ సమయంలో ఏర్పడే ఫ్రీక్వెన్సీ కూడా ష్రైబర్‌‌‌‌సైట్‌‌లోని ఫాస్ఫరస్‌‌ నుంచి జీవం పుట్టడానికి సరిపడుతుందని అనుకున్నారు. అయితే జీవం పుట్టిందని నమ్ముతున్న సమయంలో (350–450 కోట్ల ఏండ్ల క్రితం) ఆ ఫ్రీక్వెన్సీ క్రియేట్ అవ్వడానికి కావాల్సినంతటి స్థాయిలో భూమిపైకి ఆస్టరాయిడ్స్ పడలేదని తమ టీమ్ అంచనా వేసినట్లు బెంజమిన్ హెస్ తెలిపారు. అయితే ష్రైబర్‌‌‌‌సైట్స్‌‌ ఏర్పడడానికి మరో దారి కూడా ఉందని, అదే పిడుగులని ఆయన చెప్పారు.

ఏటా 100 కోట్ల పిడుగులు..

ఏటా భూమిపై పడే పిడుగుల లెక్కను కచ్చితంగా అంచనా వేసే టెక్నాలజీ నేడు అందుబాటులో ఉంది. ప్రస్తుతం 56 కోట్ల పిడుగులు భూమిని తాకుతున్నాయని బెంజమిన్ చెప్పారు. అయితే భూమి ఏర్పడిన తొలినాళ్లలో ఏటా 100 నుంచి 500 కోట్ల పిడుగులు, మెరుపులు ఏర్పడేవని, అందులో  పది కోట్ల నుంచి 100 కోట్ల వరకు భూమిని తాకేవని సైంటిస్టులు లెక్కగడుతున్నారు.  ఇలా పిడుగుల తాకిడితో ఏటా సుమారు 11 వేల కిలోల వరకు ష్రైబర్‌‌‌‌సైట్ మినరల్స్ ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని 100 కోట్ల సంవత్సరాల్లో 0.1 నుంచి 1 క్విలియన్ పిడుగులు భూమిని తాకిన తర్వాత గానీ జీవం ఆవిర్భావానికి సరిపడే ఫాస్ఫరస్ పైకి రాలేదని వాళ్లు చెబుతున్నారు. కంటిన్యూగా జరిగిన పిడుగుపాటు వల్ల ఆ ఫాస్ఫరస్ నీటితో కలిసి తొలి జీవం ఏర్పడిందని బెంజమిన్ తెలిపారు. ఈ పిడుగుల నుంచి ఏర్పడిన ష్రైబర్‌‌‌‌సైట్ మినరల్స్‌‌కు సంబంధించిన ఒక రాయి గ్లెన్‌‌ ఎలైన్ ప్రాంతంలో దొరికింది. దానిపై చేసిన రీసెర్చ్ ఆధారంగా జీవానికి పిడుగులే ఆధారమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.