మేమేం మాట్లాడుకున్నా అది స్నేహపూర్వకంగానే ఉంటుంది : థరూర్, ఖర్గే

మేమేం మాట్లాడుకున్నా అది స్నేహపూర్వకంగానే ఉంటుంది : థరూర్, ఖర్గే

తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకంతో ఉన్నానని.. కాంగ్రెస్ పార్టీ భవితవ్యం పార్టీ కార్యకర్తల చేతుల్లోనే ఉందని కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్ అన్నారు. కాంగ్రెస్ పునరుజ్జీవనం ప్రారంభమైందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. తాను ఖర్గేతో మాట్లాడానన్న ఆయన.. ఏం జరిగినా, తాము సహోద్యోగులుగానే, స్నేహితులుగానే ఉంటామని స్పష్టం చేశారు.

ఇది మా అంతర్గత ఎన్నికలలో ఒక భాగమని కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. తాము ఏదైతే మాట్లాడుకున్నామో అది స్నేహపూర్వకంగానే ఉంటుందన్న ఆయన... కలిసికట్టుగా పార్టీని నిర్మించాలని అనుకున్నట్టు వెల్లడించారు. శశి థరూర్ తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని, తాను కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశానని ఖర్గే చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం సహా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్టీలోని 9 వేల మంది పీసీసీ డెలిగేట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి  ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నేతలు 75 మంది ఏఐసీసీ కార్యాలయంలో ఓటేయనున్నారు. మరో 280 మంది పీసీసీ డెలిగేట్స్ ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీసులో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

భారత్ జోడో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సంగనకల్లు క్యాంపులో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ కు తరలించనున్నారు. ఈ నెల 19 పోలైన ఓట్ల లక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటిస్తారు.

137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరగడం ఇది ఆరోసారి మాత్రమే. సోనియా, రాహుల్, ప్రియాంక బరిలో లేకపోవడంతో 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానున్నారు.