- కేబినెట్ భేటీలో.. బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం
- రైతు భరోసా నిధులు, సాగు నీటి ప్రాజెక్టులు, స్థానిక ఎన్నికలు, ఉద్యోగుల సర్దుబాటుపై చర్చించే అవకాశం
రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం (ఫిబ్రవరి 23) జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్‌లో జరగనున్న ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తేదీల ఖరారు, బడ్జెట్ పద్దు ప్రపోజల్స్‌పై చర్చించనున్నట్లు తెలిసింది. అదేవిధంగా యాసంగి రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం (ఫిబ్రవరి 23) జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్‌లో జరగనున్న ఈ బేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తేదీల ఖరారు, బడ్జెట్ పద్దు ప్రపోజల్స్‌పై చర్చించనున్నట్లు తెలిసింది. అదేవిధంగా యాసంగి రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు కొత్త కార్పొరేషన్లలో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తూనే, దేవాదుల ప్యాకేజీ-3 పనుల కొనసాగింపునకు అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులను మంత్రులు ఆమోదించనున్నారు. క్షేత్రస్థాయిలో పాలనను పటిష్టం చేసే దిశగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. గిగ్ వర్కర్ల బిల్లుకు మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
బడ్జెట్ రూపకల్పనకు ముందు జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణను, ప్రాధాన్యతలను నిర్దేశించడంలో అత్యంత కీలకం కానుంది. ఏకకాలంలో సంక్షేమ పథకాలు, ఉద్యోగ సర్దుబాట్లు, సాగునీటి ప్రాజెక్టులతో పాటు రాజకీయ ప్రాధాన్యత ఉన్న స్థానిక ఎన్నికలపై సర్కారు తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
