తెలుగులో తొలి పదం రాసిందెక్కడ?

తెలుగులో తొలి పదం రాసిందెక్కడ?
  • కీసరగుట్ట లేఖనం అంటున్న తెలంగాణ హిస్టారియన్స్
  • కడప కలమల్ల శాసనమంటున్న ఆంధ్ర చరిత్రకారులు 

హైదరాబాద్, వెలుగు: తెలుగులో తొలి పదం రాసిందెక్కడ?.. ఇప్పుడు ఇదే విషయంపై తెలుగు రాష్ట్రాల చరిత్రకారుల మధ్య రగడ మొదలైంది. ఏపీలోని కడప జిల్లాలో బ్రిటీష్ కాలంలోనే ఆనవాళ్లు కనిపించకుండపోయి మూడ్రోజుల క్రితమే దొరికిన కలమల్ల శాసనం తొలి తెలుగు శాసనమని అక్కడి చరిత్రకారులు, పరిశోధకులు చెప్పడం ఇందుకు కారణమైంది. కలమల్ల శాసన కాలానికి వందేళ్ల కిందట్నే కీసరగుట్టలో ‘తొలుచువాండ్రు’ అనే తెలుగు పదం రాశారని తెలంగాణ చరిత్రకారులు చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. ఇప్పటికే ఏపీ హిస్టరీ బుక్కుల్లో కలమల్ల శాసనం గురించి చేర్చినా.. మన దగ్గర కీసరగుట్ట శాసనాన్ని మాత్రం రాష్ట్ర సర్కారు ఇంకా చేర్చలేదు.

ముందు నుంచీ వివక్షే 
‘తెలుగులో మొదటిది ఏది?’ అన్న ప్రశ్న వచ్చినప్పుడల్లా.. అన్నీ ఆంధ్ర ప్రాంతం నుంచే వచ్చాయంటూ అక్కడి సాహిత్య, చరిత్రకారులు ప్రచారం చేస్తూ వచ్చారు. అచ్చ తెలుగు కావ్యం, కథ, నవల విషయంలో ఇదే జరిగింది. శాసనాల విషయానికొస్తే 575వ సంవత్సరంలో చోళుల కాలం నాటి కలమల్ల శాసనమే తొలి తెలుగు శాసనమనే ప్రచారం ఉంది. తెలంగాణలో దానికి వందేళ్ల క్రితమే విష్ణుకుండినుల రాజైన 2వ మాధవవర్మ హయాంలోనే కీసరగుట్టలో శాసనం రాశారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్​ రామోజు హరగోపాల్​ చెప్పారు.  410–-435లో  రామలింగేశ్వర ఆలయం వద్ద రాతిగుండుపై ‘తొలుచువాండ్రు’ అని శిల్పులు రాసినట్టు పేర్కొన్నారు. కీసరగుట్టలో కోట, గుడులు నిర్మించిన శిల్పులున్న వేదికకు ఆ పేరు పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ శాసనాన్ని 1967లోనే అప్పటి చరిత్రకారులు గుర్తించారని, మొదటి నుంచి తెలంగాణపై ఉన్న వివక్ష వల్లే ఉమ్మడి ఏపీలోని చరిత్రకారులు దానిని తొలి శాసనంగా గుర్తించలేదని అన్నారు.