వాషింగ్టన్: ఇండియాపై విధించిన ప్రతీకార సుంకాలను అమెరికా 25 నుంచి 18 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా యూఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగానే.. ఇండియాకు మరో ఊరట కల్పించే నిర్ణయం తీసుకునే యోచనలో అమెరికా ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందనే సాకుతో ఇండియాపై అమెరికా 25 శాతం అదనపు వాణిజ్య సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ 25 శాతం సుంకాలను కూడా తగ్గించాలని అమెరికా భావిస్తోంది. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారి ఒకరు ధృవీకరించారు. రష్యన్ చమురు కొనుగోలు కారణంగా భారత దిగుమతులపై అదనంగా విధించిన 25 శాతం సుంకాన్ని కూడా అమెరికా తగ్గిస్తుందని ఆయన తెలిపారు. ఇందుకు భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను తగ్గించడమే కాకుండా పూర్తిగా ఆపేయాలని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోడీ పట్ల స్నేహం, గౌరవం కారణంగా ఇండియాపై విధించిన పరస్పర వాణిజ్య సుంకాన్ని 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల్లోనే వైట్ హౌస్ నుంచి ఈ ప్రకటన వెలువడం గమనార్హం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇండియా భారీ ఉపశమనం దక్కుతుంది. కొంత కాలంగా అమెరికాకు నిలిచిపోయిన భారత ఎగుమతులు మళ్లీ పుంజుకోకున్నాయి.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మిత్రదేశాలైన ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇండియాపై ట్రంప్ యడాపెడా విధించిన వాణిజ్య సుంకాలే. ప్రతీకార సుంకాలు అని 25 శాతం, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుదనే సాకుతో మరో 25 శాతం.. మొత్తం ఇండియాపై 50 శాతం సుంకాలు వడ్డించాడు ట్రంప్.
దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఈ పరిణామాలతో ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కూడా నిలిచిపోయాయి. ఇదే సమయంలో ఇండియా యూరోపియన్ యూనియన్, జపాన్ వంటి దేశాలతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. దీంతో అప్రమత్తమైన ట్రంప్ 140 కోట్ల జనాభాతో గ్లోబల్ మార్కెట్లో భారీ వాటా కలిగిన ఇండియాతో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నారు.
ఈ డీల్ లో భాగంగా ఇండియాపై విధించిన 25 శాతం పరస్పర సుంకాన్ని 25 నుంచి 18 శాతానికి తగ్గించాడు. ఇదే కాకుండా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని కారణంతో భారత్ పై విధించిన మరో 25 శాతం అదనపు సుంకాన్ని కూడా తగ్గించే యోచనలో అమెరికా ఉన్నట్లు వైట్ హౌస్ అధికారి వ్యాఖ్యలతో స్పష్టమైంది. ఇదే జరిగితే ఇండియాపై 50 శాతం ఉన్న టారిఫ్స్ 18 శాతానికి తగ్గుతాయి. తద్వారా ఇండియా నుంచి అమెరికాకు భారీగా ఎగుమతులు పెరుగుతాయి.
