సీక్రెట్ గా ఎందుకు కూల్చుతున్నరు?
మీడియాకు అనుమతిపై నిర్ణయం చెప్పడంలో లేటెందుకు?: హైకోర్ట్
శుక్రవారం వరకు చెప్పకుంటే తామే తగిన ఉత్తర్వులిస్తామని కామెంట్
మీడియాకు అనుమతిస్తే ప్రమాదాలు జరుగుతాయన్న ఏజీ
సెక్రటేరియట్ కూల్చివేత కవరేజీపై ‘వీ6‑ వెలుగు’ పిటిషన్.. కొనసాగిన విచారణ
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ బిల్డింగ్స్‌ను అంత సీక్రెట్ గా కూల్చాల్సిన అవసరం ఏంటని, కవరేజీకి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాను ఎందుకు అనుమతించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి నిలదీసింది. మీడియాను అనుమతించే విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించి చెప్పడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారని ఏజీని ప్రశ్నించింది. ‘గురువారం చెప్పాలని స్పష్టంగా చెప్పాం. మళ్లీ సోమవారం చెబుతామంటున్నారు. మీ తీరు అర్థం కావడం లేదు. మీరడిగినట్టు సోమవారం వరకు టైమ్ ఇవ్వలేం. (శుక్రవారం)ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయండి. లేకుంటే మేమే తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుంది’అని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఇప్పటికే 90 శాతం కూల్చివేత పూర్తి: ఏజీ
సచివాలయం కూల్చివేత పనులను కవరేజీ చేయకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై ‘వీ6 –వెలుగు’ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై జడ్జి జస్టిస్ చల్లా కోదండరామ్ రెండో రోజు గురువారం విచారణ కొనసాగించారు. సెక్షన్180 (ఇ) ప్రకారం కూల్చివేత ప్రాంతంలోకి ఇతరులను అనుమతించేందుకు వీల్లేదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. భారీ యంత్రాలతో కూల్చివేత పనులు జరుగుతున్నందున మీడియాను అనుమతిస్తే ప్రమాదాలు జరగొచ్చన్నారు. మీడియాను అనుమతిస్తే ప్రజలు కూడా అనుమతి కోరే అవకాశముందన్నారు. ఇప్పటికే 90 శాతం కూల్చివేత పనులు జరిగాయని, కూల్చివేతతో వ్యర్థాలు పేరుకుపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చి వేతల దగ్గరకు ఇతరులు ఎవరినీ అనుమతి ఇవ్వకపోవడమే ఉత్తమమని చెప్పుకొచ్చారు.
కావాలనే ప్రభుత్వం కాలయాపన
‘వీ6–వెలుగు’తరఫు లాయర్ నవీన్ కుమార్ వాసిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయని ప్రభుత్వం చెబుతోందంటే సోమవారం నాటికి దాదాపు కూల్చివేత పనులు మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తున్నట్టు అర్థమవుతోందని, సోమవారం వరకూ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి ఉండాల్సి వస్తే ఈలోగా టీవీ చానల్స్, పత్రికల కవరేజీకి అనుమతి ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అనధికార కట్టడాల్ని అధికారులు కూల్చే సమయంలో మీడియాను అనుమతిస్తున్నారని, ఇప్పటివరకు అటువంటి ప్రదేశాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైడ్రాలిక్స్ మిషన్లు, బుల్‌డోజర్లతో కూల్చివేస్తున్న ఘటనలను మీడియా కవర్ చేసిందని చెప్పారు. కూల్చి వేత ప్రదేశం అనేది ఇక్కడ అంశం కాదని, అక్కడికి మీడియాను అనుమతించకపోవడం, పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారన్నదే తమ ప్రధాన అంశమని చెప్పారు.
కూల్చివేతపై బులిటెన్ ఇవ్వొచ్చుగా?
వాదనలు విన్న కోర్టు.. ‘ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోంది. స్పష్టమైన వైఖరితో రావాలి కదా? ఎందుకు రావట్లేదు? గుట్టుగా ఎందుకు ఉంటోంది. కూల్చివేతపనుల ఫొటోలు, వీడియోలను ప్రభుత్వమే పత్రికలకు ఇవ్వొచ్చుగా? కరోనా బులిటెన్ మాదిరిగా సెక్రటేరియట్ కూల్చివేతపైనా బులిటెన్ ఇస్తే నష్టం ఏమిటి?’ అని హైకోర్టు కామెంట్ చేసింది.
లేదంటే మేమే ఉత్తర్వులిస్తం
‘ప్రభుత్వ తీరు అనుమానాలకు తావిస్తోంది. కూల్చివేతలపై దాపరికం ఎందుకో అర్థం కావడం లేదు. కూల్చి వేత పనుల గురించి ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదు. అంతా అనుమానాస్పదంగా ఉంది. డైలీ బులిటెన్ రిలీజ్ చేయడానికి ఉన్న అడ్డంకులేంటి? 95 శాతం కూల్చివేతలు జరిగినా ఎందుకు వాటి గురించి మీడియాకు ప్రకటించట్లేదు. సెక్రటేరియట్ లోపల ఎలాంటి డ్రామా జరుగుతోందో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కదా? ప్రభుత్వం కోరినట్లు సోమవారానికి వాయిదాకు అంగీకరిస్తే డ్రామాకు తెరపడిపోతుంది. సినిమా అయ్యాక టిక్కెట్లు ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. సోమవారానికి కాదు. శుక్రవారమే ప్రభుత్వంతో సంప్రదించి ఏజీ చెప్పాలి. లేదంటే మేమే ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుంది’అని కోర్టు వ్యాఖ్యానించింది.

