రాష్ట్రానికి పైసా పని చేయని.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్

రాష్ట్రానికి పైసా పని చేయని.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్
  •      దేవుడి పేరు చెప్పి ఓట్లడుగుతున్నరు 

శామీర్‌‌పేట, వెలుగు :  పదేండ్లలో రాష్ట్రానికి పైసా పని చేయని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. మాల్కాజ్​గిరి లోక్​సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి బుధవారం శామీర్​పేటలోని కలెక్టరేట్ ఆఫీస్​లో నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట కేటీఆర్​తో పాటు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్​లో కేటీఆర్ మాట్లాడారు.

 ‘‘పదేండ్లలో రాష్ట్రం కోసం బీజేపీ చేసిందేమీ లేదు. అందుకే దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తున్నరు. సెంటిమెంట్​కు పోయి ఓటేస్తే ఆగం అయితరు. దేశాన్ని దివాలా తీయించిన బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి. బీఆర్​ఎస్​కు 10 నుంచి 12 సీట్లు వస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించేది కేసీఆరే. మల్కాజ్​గిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’’అని కోరారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులైనా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదన్నారు. మళ్లీ అబద్ధాలు చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నదని అన్నారు. ఐదేండ్లు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారని, ఇప్పుడు సీఎం అయ్యారని అయినా.. మల్కాజ్​గిరి ప్రజల కోసం ఏం చేయలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయొద్దని, ప్రజలకు అందుబాటులో ఉండే లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు.