- కూకట్ పల్లిలో దారుణం
కూకట్పల్లి, వెలుగు: అనుమానంతో వేధిస్తున్నాడని భర్తను హత్య చేసింది భార్య. ఆపై హత్యను ప్రమాదంగా చిత్రీకరించింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఈ ఘటన జరిగింది. ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన జగ్గవరపు సుధీర్ రెడ్డి (44), బ్రహ్మజ్ఞాన ప్రసన్న (43) దంపతులు బతుకుదెరువు కోసం సిటీకి వచ్చారు. కూకట్‌పల్లిలోని ఈనాడు కాలనీలో నివసిస్తున్నారు. సుధీర్ రెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రసన్న ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సుధీర్.. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తుండేవాడు.
దీంతో విసిగిపోయిన బాధితురాలు.. భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సుధీర్ రెడ్డి.. హత్యకు గురవ్వటానికి వారం ముందే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 23న రాత్రి తన భర్త తాగిన మైకంలో ఇంట్లో కిందపడి మంచం కోడుకు తల కొట్టుకుని చనిపోయాడని ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, తాగిన మైకంలో ఉన్న సుధీర్ ను ప్రసన్న తన చున్నీతో గొంతు బిగించి హత్య చేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
