తృణమూల్ మరో శివసేన అవుతుందా..? మాదే అసలైన పార్టీ అంటున్న మరో వర్గం.. దీదీ ఒంటరవుతున్నారా..?

తృణమూల్ మరో శివసేన అవుతుందా..? మాదే అసలైన పార్టీ అంటున్న మరో వర్గం.. దీదీ ఒంటరవుతున్నారా..?

వెస్ట్ బెంగాల్ లో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ ఓటమి ఆ పార్టీని చీలికదిశగా నడిపిస్తోంది. బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ మహారాష్ట్ర మాదిరిగా రాజకీయ వాతావరణం మారిపోతోంది. మమతా బెనర్జీ రెక్కల కింది పనిచేస్తూ వస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. తృణమూల్ తమదేనని దీదీకి సవాల్ విసురుతున్నారు. 

ఈ పరిణామాలు మహారాష్ట్ర శివసేన పార్టీ సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నాయి. పార్టీని రెండుగా చీల్చిన ఏక్ నాథ్ శిండే.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్ధతుతో శివసేన పార్టీని, గుర్తును కైవసం చేసుకుని.. బీజేపీ పొత్తుతో అప్పట్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అచ్చం అలాంటి పరిణామాలే బెంగాల్ లో కనిపిస్తున్నాయి. కాకపోతే బీజేపీకి ఇక్కడ పూర్తి మెజారిటీ ఉండటంతో డిప్యూటీ పదవి ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు. కానీ వేర్పాటు వాద గ్రూప్ వెనక బీజేపీ హస్తం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 

పార్టీ చీలిక అంచున ఉందని చెప్పడానికి 2026 జూన్ 02న జరిగిన పరిణామాలే కారణం. కోల్‌కతాలోని రాణి రస్మోని అవెన్యూలో మమతా బెనర్జీ నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శనకు.. పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 7 మంది మాత్రమే హాజరవడం చర్చలకు దారితీసింది.  మరోవైపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పుడు అసలైన  టీఎంసీ వారసులం తామేనని సవాల్ విసురుతున్నారు.  

ఇప్పుడు తమను తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్‌గా ప్రకటించుకోవడానికి సిద్ధమవుతున్నారని పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నాయకుడు రిజు దత్తా అన్నారు.

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ లోని అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై  దాడి, పార్టీ నాయకుల భద్రతపై ఆందోళన, కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్తూ.. కోల్‌కతాలోని రాణి రస్మోని అవెన్యూలో వీధి పోరాటానికి దిగారు మమతా. 50 మంది వేరు కుంపటి పెట్టేలా కనిపిస్తుండటంతో ఇప్పుడు తన సొంత పార్టీలోనే దీదీ ఒంటరి అయ్యే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 

50 మంది ఎమ్మెల్యేలతో కూడిన బృందం హోటల్ లో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. బహిష్కృత నేత రిజు దత్తా.. 50 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అధిగమించేందుకు సరిపోతారని అన్నారు. హోటల్ లో రహస్య సమావేశం పెట్టిన రిజు దత్తా టీమ్.. రితాబ్రతా బెనర్జీకి తమ మద్ధతు తెలుపుతున్నట్లుగా చెప్పడం మమతా బెనర్జీకి పెద్ద షాకింగ్ న్యూసనే చెప్పాలి.