- రోస్టర్ విధానంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లా
- భద్రాచలంలో సామాజిక న్యాయసాధన సభకు హాజరు
భద్రాచలం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: మాలలు, మాల ఉప కులాల హక్కుల కోసం ముందుండి పోరాటం చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం భద్రాచలంలో నిర్వహించిన మాలల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయసాధన సభ, భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. రోస్టర్ విధానం వల్ల మాలలకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయాన్ని ఇదివరకే సీఎం దృష్టికి తీసుకెళ్లానని, ఈ సమస్యను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించారని తెలిపారు.
కొన్ని కారణాల వల్ల కమిటీ మీటింగ్ ఆలస్యమైందని చెప్పారు. ఈ అంశంపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని, ఆలస్యమైతే మాలల్లో ఆందోళన తీవ్రమవుతుందని సీఎం, ఉత్తమ్ కుమార్‌రెడ్డికి చెప్పానన్నారు. మాల జాతికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. గ్రూపులుగా ఉంటే బలహీన పడతామని, అంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. మాలల హక్కులను కాలరాసే రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, దీనివల్ల ఉద్యోగం, ప్రమోషన్లు, విద్యావకాశాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు.
త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం చేయాల్సి వస్తుందని విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చేస్తామని చెబుతుందని, 2011 జనాభా లెక్కలు ప్రామాణికంగా చేయడం తప్పని తాము చెబుతున్నామన్నారు. షమీమ్ అఖ్తర్ నివేదిక కూడా అదే చెబుతోందన్నారు. గోదావరి బ్రిడ్జి సెంటర్ నుంచి మాలమహానాడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా పాల్గొన్నారు. చర్ల రోడ్డులోని గిరిజన అభ్యుదయ భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ అంబేద్కర్, బీవీ రావు చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి, నివాళి అర్పించారు.
కరప్షన్‌కు కేరాఫ్ బీఆర్‌ఎస్ సర్కారు..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కరప్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మంత్రి వివేక్ ఆరోపించారు. చుంచుపల్లి మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రూ.లక్ష కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్, హరీశ్ రావు కమీషన్ల ప్రాజెక్టుగా మార్చేశారని విమర్శించారు. కాళేశ్వరం, మేడిగడ్డ అంశంపై కేటీఆర్, హరీశ్ రావు మాయమాటలతో ప్రజలను మభ్య పెడ్తున్నారని మండిపడ్డారు.
తాను 110 అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం చేశానని, అంబేద్కర్ స్ఫూర్తితో దళిత విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి స్టూడెంట్స్ చేరుకుంటారన్న ఆలోచనతో సాయం చేస్తున్నానని చెప్పారు. తన తండ్రి వెంకటస్వామి ఆలోచనలకు అనుగుణంగా కాకా ఫౌండేషన్, అంబేద్కర్ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేశ్, సింగరేణి డైరెక్టర్ తిరుమల రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కార్పొరేటర్లు, నాయకులు
పాల్గొన్నారు.
పాల్వంచలోని విద్యుత్ మాల ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బూరుగుల విజయ్ భాస్కర్ ఇంట్లో మంత్రిని పలువురు కార్పొరేటర్లు, నేతలు సన్మానించారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వెళ్తున్న మంత్రి వివేక్‌ని ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్ద జిల్లా మాలమహనాడు నాయకులు కలిసి శాలువాతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా మాలమహనాడు నాయకులు గుంతేటి వీరభద్రం, పల్లా రాజశేఖర్, మాలమహనాడు జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, ఉద్యోగ సంఘం నాయకులు జంగం లక్ష్మణ్ రావు, గుడిపూడి కృష్ణయ్య, పెరుమాళ్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో మంత్రి పూజలు..భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆదివారం మంత్రి వివేక్ వెంకటస్వామి
ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి ఆయన ఆలయానికి రాగా ఈవో దామోదర్ రావు ఆధ్వర్యంలో అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రాకార మండపంలో ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈవో దామోదర్ రావు ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.
