ఆ రోజు అభినందన్ తండ్రికి ఏం చెప్పానంటే: ఐఏఎఫ్ చీఫ్

ఆ రోజు అభినందన్ తండ్రికి ఏం చెప్పానంటే: ఐఏఎఫ్ చీఫ్
  • అభినందన్ పాక్ కి చిక్కగానే.. కార్గిల్ గుర్తొచ్చింది

న్యూఢిల్లీ: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్.. ఈ పేరు ప్రతి భారతీయుడి గుండెల్లో మన సైన్యం ధీరత్వానికి గుర్తుగా ముద్రపడిపోయింది. శత్రు గడ్డపై నిల్చుని ఉన్నా తలవంచని ఆ వీర సైనికుడు.. పాక్ ఆర్మీ చేతికి చిక్కి.. తిరిగి భారత్ లో అడుగు పెట్టిన క్షణాలు ఎవరూ మర్చిపోలేరు. అయితే అసలు అభినందన్ తన యుద్ధ విమానం నుంచి పడిపోయి పాక్ సేనలకు దొరికిన తర్వాత ఆయన కుటుంబం పరిస్థితి ఏమిటి? ఎవరైనా వారికి పరిస్థితిని వివరించారా? అన్న ప్రశ్నలకు దాదాపు ఏడు నెలల తర్వాత సమాధానం దొరికింది. ఓ జాతీయ మీడియా సంస్థతో శుక్రవారం మాట్లాడిన భారత వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ మార్షల్ బీఎష్ ధనోవ్ నాటి విషయాలను పంచుకున్నారు.

కచ్చితంగా తీసుకొస్తామని చెప్పా..

అభినందన్ పాక్ లో పడిపోయిన తర్వాత ఆయన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడానని ధనోవ్ చెప్పారు. ఆ సమయంలో పాక్ పై ఉన్న ఒత్తిడిని ఆయనకు వివరించానన్నారు. అభినందన్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్ కు తీసుకొస్తామని ధైర్యం చెప్పానన్నారు. అయితే అభినందన్ పాకిస్థాన్ లో పడిపోగానే తనకు కార్గిల్ యుద్ధం గుర్తొచ్చిందన్నారు ఐఏఎఫ్ చీఫ్. నాడు తన ఫ్లైట్ కమాండర్ అజయ్ అహూజ కూడా ఇలానే పాక్ భూభాగంలో పడిపోయాడని, ఆయన్ని పాక్ కాల్చి చంపేసిందన్నారు. కానీ, అభినందన్ విషయంలో అలా జరగదని గట్టిగా నమ్మకం ఉండిందని చెప్పారు.

నాటి ఘటన ఇదీ..

ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై పాక్ ముష్కర మూక వికృత దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఐఏఎఫ్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఫిబ్రవరి 26న పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్ లో ఉన్న పాక్ ముష్కర సంస్థ జైషే స్థావరంపై భారత వాయుసేన మిరాజ్ యుద్ధ విమానాలతో బాంబులు కురిపించి వచ్చింది. ఆ దాడిలో ఉగ్ర క్యాంపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 300 మంది ముష్కరులు హతమయ్యారు. దీనికి ప్రతిగా స్పందించిన పాక్ తన వాయుసేనతో భారత్ లోని సైనిక స్థావరాలపై దాడికి యత్నించింది. దానిని విజయవంతంగా మన ఎయిర్ ఫోర్స్ తిప్పికొట్టింది. ఈ మిషన్ లో భాగంగా పాక్ యుద్ద విమానాన్ని మిరాజ్ యుద్ధ విమానంతో కూల్చిన వింగ్ కమాండర్ అభినందన్ జెట్ క్రాష్ అయింది. దీంతో పాక్ లో భూభాగంలో పడిపోయాడు. అభినందన్ ను పాక్ సైనికులు నిర్భంధంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేవలం 60 గంటల్లోనే భారత్, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టి దౌత్య పరంగా ఒత్తిడి తేవడంతో పాక్ ఆయనను తిరిగి స్వదేశానికి పంపింది.