బెంగాల్‎లో గెలిస్తే యూసీసీ అమలు చేస్తం: కేంద్ర మంత్రి అమిత్ షా

బెంగాల్‎లో గెలిస్తే యూసీసీ అమలు చేస్తం: కేంద్ర మంత్రి అమిత్ షా

కోల్‌‌కతా: బెంగాల్‎లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి–యూసీసీ) అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా ప్రకటించారు. శుక్రవారం ఆయన కోల్‌‌కతాలో బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్​చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ప్రసిద్ధ పంక్తులు చిత్తో జెఖానే భోయ్ శూన్యో(మనసు ఎక్కడైతే భయం లేకుండా ఉంటుందో...) స్ఫూర్తితో దీన్ని రూపొందించినట్లు తెలిపారు. మతం ఏదైనా రాష్ట్ర పౌరులందరికీ ఒకే చట్టం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలవుతోందని పేర్కొన్నారు. 

ఒక పౌరుడికి నాలుగు వివాహాలకు అనుమతి ఇచ్చి, మరొకరిని ఒక్కదానికే పరిమితం చేయడం అంటే ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం కాదా అని ప్రశ్నించారు. తాము అలాంటి రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. యూసీసీ ప్రతిపాదన బీజేపీది కాదని, రాజ్యాంగ పరిషత్ చేసిన సిఫార్సు అని చెప్పారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ ప్రజలు భయం నీడలో బతుకుతున్నారని ఆరోపించారు.

మేనిఫెస్టోలోని 15 ముఖ్యమైన అంశాలు..

రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.3 వేల ఆర్థికసాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, హెచ్‌‌పీవీ వ్యాక్సినేషన్ చేస్తామని హామీ ఇచ్చింది. 

ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని, ఉద్యోగులకు 45 రోజుల్లోనే 7వ పే కమిషన్ సిఫార్సులను అమలుచేస్తామని, పెండింగ్‌‌ డీఏ చెల్లిస్తామని పేర్కొంది. గత 15 ఏండ్లలో జరిగిన అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్లు, గోవుల స్మగ్లింగ్‌‌ను అరికట్టడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని ప్రకటించింది.