లోకల్​ బాడీ ఎలక్షన్లు పెడ్తరా..? లేదా?

లోకల్​ బాడీ ఎలక్షన్లు పెడ్తరా..? లేదా?
  • రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు వేల ఖాళీలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల  స్థానాల్లో  ఎలక్షన్లు పెట్టేందుకు సర్కారు వెనకడుగు వేస్తోంది. ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం  ప్రతిపాదన పెట్టినా ప్రభుత్వం ఇంకా గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వలేదు.  కరోనా కారణంగా రెండేండ్ల నుంచి ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ఓమిక్రాన్ ఇప్పుడు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఎలక్షన్ల నిర్వహణకు ఎన్నికల సంఘం రెడీ అయింది. సర్కారు నుంచి అనుమతి వస్తే ఏప్రిల్​లో ఎలక్షన్లకు అవకాశముందని ఎస్​ఈసీ  అధికారులు చెబుతున్నారు.
ఐదు వేల ఖాళీలు
రాష్ట్రంలో వార్డు మెంబర్లు, సర్పంచ్​లు, ఉపసర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సీట్లు అన్ని కలిపి సుమారు ఐదు వేల వరకు ఖాళీలున్నాయి. వీటిలో వార్డు మెంబర్లు  4,235, సర్పంచ్ లు 169, ఎంపీటీసీలు 88 ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇంటర్, టెన్త్  ఎగ్జామ్స్​ ఏప్రిల్, మే నెలల్లో స్టార్ట్​ కానున్నాయి. ఈ ఎగ్జామ్స్​కు ముందే ఎన్నికలు జరిపే అవకాశాలున్నాయి. ‘కరోనా వల్ల ఎన్నికలు లేటయ్యాయి. ఏప్రిల్​లో నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తున్నాం. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వగానే ప్రాసెస్ట్ స్టార్ట్ చేస్తం.’ అని రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ అధికారి తెలిపారు.  

వ్యతిరేకత ఉందనే ఎలక్షన్లు పెడ్తలె
రాష్ట్రంలో దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్ బై పోల్స్​నిర్వహించారు. వాటికి లేని కరోనా రూల్స్​ లోకల్ బాడీ ఎన్నికలకు ఎందుకు?  క్షేత్రస్థాయిలో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఎన్నికలకు పోవట్లే. రాజ్యాంగంలో 73 ఆర్టికల్​ ప్రకారం సర్పంచ్ పదవి ఖాళీ అయిన 45 రోజుల్లో ఎన్నిక జరపాలి.  కానీ పట్టించుకోవడం లేదు. వెంటనే ఎలక్షన్లు పెట్టాలి.  - చింపుల సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు

ఖాళీగా ఉన్న లోకల్ బాడీ సీట్లు
జడ్పీటీసీలు    3
ఎంపీటీసీలు    88
సర్పంచ్ లు    169
గ్రామ పంచాయతీ 
వార్డు మెంబర్లు    4,235
జడ్పీ వైస్ చైర్మన్ పోస్ట్     1  
ఉప సర్పంచ్ ఖాళీలు     337
ఎంపీపీ ఖాళీలు    5