న్యూఢిల్లీ: టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిన సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. బ్యాటర్‌గా అతని ఫామ్ ఆందోళన కలిగిస్తుండటంతో... 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ జట్టులో సూర్యకు చోటు దక్కుతుందా? లేదా? అన్న చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో జూన్–జులైలో జరిగే ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లు సూర్యకు అత్యంత కీలకం కానున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సూర్య కెప్టెన్సీ కంటే బ్యాటింగ్‌పైనే సెలెక్టర్లు ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు సూర్యకు ఉన్నా.. ఒలింపిక్స్ నాటికి అతని వయసు 38 ఏళ్లకు చేరుకుంటుంది.
దాంతో అతన్ని కొనసాగించాలా? వద్దా? అనే దానిపై సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. 2025లో ఘోరంగా విఫలమైన సూర్యకుమార్ ఈ ఏడాది కాస్త పుంజుకున్నట్లు కనిపించాడు. కానీ కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడం జట్టుకు ఇబ్బందిగా మారింది. వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో పాటు ఫైనల్లో ఫెయిల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.

