పసిడి దిగొచ్చేనా ?

పసిడి దిగొచ్చేనా ?

పసిడి పరుగులకు బ్రేక్ పడనుందా ?  బంగారం ధర మరింత దిగి రానుందా ?  అంటే బులియన్ మార్కెట్ పరిశీలకులు ఔననే సమాధానమే చెబుతున్నారు.  ప్రస్తుతం రూ.52,750  వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు)  ధర  మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇదే సంకేతాలను ఇస్తూ.. తాజాగా మంగళవారం ఉదయం కూడా ‘ఎంసీఎక్స్’ గోల్డ్ ఫ్యూచర్స్ లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ.195 తగ్గి రూ.50,469కి చేరింది. ఇది నాలుగు వారాల కనిష్ఠ ధర.  

అంతకుముందు రోజు..

అంతకుముందు రోజు (సోమవారం)  సైతం గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ లో బంగారం ధర 2 శాతం తగ్గింది. డాలరు సూచీ రెండు దశాబ్దాల గరిష్టానికి పెరిగి, అదే స్థాయిల్లో నిలకడగా కదలికలు సాగిస్తోంది. ఈనేపథ్యంలో మదుపరుల చూపు బంగారం ఫ్యూచర్స్ నుంచి..  డాలర్ ట్రేడింగ్ వైపు మళ్లుతోంది. అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే బాండ్లపై వడ్డీరేట్లు కూడా ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటిని మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.  దీంతో  మదుపరులు తమ వద్దనున్న గోల్డ్ ఫ్యూచర్స్ ను అమ్మేసుకొని,  వచ్చిన డబ్బును ఫెడరల్ రిజర్వ్ బాండ్లలో పెట్టుబడిగా పెడుతున్నారు.  

తీవ్ర అమ్మకాల ఒత్తిడి..

ఈనేపథ్యంలోనే జూన్ 13న (సోమవారం) బంగారం ఫ్యూచర్స్ లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ఆ ఒక్కరోజే  ఔన్సు (28.3495 గ్రాములు)  బంగారం ధర  దాదాపు 50 డాలర్లు తగ్గిపోయి, 1,825.95 డాలర్ల (రూ.1.42 లక్షలు) కు చేరింది.  ఈ వారంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగితే పసిడి ధర ఇంకా దిగి రావడం  సాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాగా, హైదరాబాద్ లో మంగళవారం నాడు 22 క్యారెట్ల బంగారం ధర  తులం (10 గ్రాములు) రూ.48,360గా కొనసాగుతోంది.  22 క్యారెట్ల బంగారం ధర తులం (10 గ్రాములు) రూ.52,760 వద్ద ఉంది.