మహాలక్ష్మి బస్సుల్లో మహిళా ప్యాసింజర్ల జాతర

మహాలక్ష్మి బస్సుల్లో మహిళా ప్యాసింజర్ల జాతర
  • మహాలక్ష్మి బస్సుల్లో మహిళా ప్యాసింజర్ల జాతర
  • వేములవాడ, కొండగట్టు ఆలయాలకు క్యూ
  • వరంగల్​లో ఒక్కరోజే 2 లక్షల 20 వేల జీరో టిక్కెట్లు  
  • కిటకిటలాడుతున్న వరంగల్‍, హనుమకొండ, కరీంనగర్‍ బస్టాండ్లు 
  • బస్సుల కోసం ఎదురుచూపులు.. సీట్ల కోసం సర్కస్‍ ఫీట్లు 
  • తీరిక లేకుండా డ్యూటీల్లో సిబ్బంది 

వరంగల్‍, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళల జాతర కనిపిస్తోంది. ఇన్నాళ్లూ పండుగో, పబ్బమో వస్తే తప్పితే ఊర్లు, టూర్లు వెళ్లని మహిళలు ఇప్పుడు కుటుంబంతో కలిసి జర్నీ ప్లాన్‍ చేసుకుంటున్నారు. కార్తీక మాసం నేపథ్యంలో ప్రధాన ఆలయాలకు మొక్కుల కోసం క్యూ కడుతున్నారు. హాలీ డే వచ్చిందంటే మహిళా ప్రయాణికులు..పిల్లాపాపలు, పెద్దోళ్లను వెంటబెట్టుకొని వస్తుండడంతో ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో పల్లె వెలుగు, ఎక్స్​ప్రెస్‍ బస్సుల కోసం ప్యాసింజర్లు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. బస్సు వచ్చాక సీట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మహాలక్ష్మి స్కీం కారణంగా ఆర్టీసీ బస్సులకు డిమాండ్‍ పెరగడంతో జీరో టిక్కెట్లు కొట్టేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. 

వేములవాడ, కొండగట్టుకు క్యూ  

ఆదివారం సెలవు దినం కావడం, ఫ్రీ బస్‍ జర్నీ ఉండడంతో వరంగల్‍ రీజియన్‍ నుంచి మహిళా ప్యాసింజర్లలో ఎక్కువ శాతం  వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న దర్శనాలకు క్యూ కట్టారు. దీనికి కార్తీకమాసం తోడవ్వడంతో కరీంనగర్‍, నిజామాబాద్‍, వేములవాడ వైపు వెళ్లే బస్సులు కనీసం నిల్చోడానికి జాగ లేకుండా ప్రయాణికులతో నిండిపోయాయి. మిగతా జీరో టిక్కెట్‍ ప్రయాణికుల్లో భద్రాచలం, హైదరాబాద్‍ వైపు ఎక్కువగా వెళ్లారు. సెలవు రోజు వచ్చిందంటే గతంలో సినిమాలు లేదంటే పార్కుల వైపు చూసిన మహిళలు ఇప్పుడు ఏదో ఒక జర్నీకి ప్లాన్‍ చేసుకుంటున్నారు. 

బస్సు సీట్ల కోసం తిప్పలు

నిన్న మొన్నటి వరకు ఆర్టీసీ బస్సు అంటే అదోలా చూసిన క్లాస్‍ జనాలు కూడా ఇప్పుడు మహాలక్ష్మి బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. వరంగల్‍ నుంచి హైదరాబాద్‍, వేములవాడ లాంటి ప్రాంతాలకు ఫ్యామిలీతో వెళ్లే క్రమంలో ఇంట్లో కనీసం ఇద్దరు, ముగ్గురికి జీరో టిక్కెట్‍ అవకాశం ఉండడంతో రానుపోనూ రూ.1500 నుంచి రూ.1800 వరకు ఆదా అవుతోందని భావిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్‍, హనుమకొండ, కరీంనగర్‍ వంటి పెద్ద బస్‍ డిపోలు మేడారం జాతర సమయాన్ని తలపిస్తున్నాయి. ఒక్కో ప్లాట్‍ఫామ్‍ వద్ద మూడు నాలుగు బస్సులకు సరిపోయే ప్యాసింజర్లు రెడీగా ఉంటున్నారు. బస్సు వస్తోందంటే చాలు ఎదురెళ్లి సీట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో కిటికీల్లోంచి కర్చీఫ్​లు వేయడాలు, డోర్ల దగ్గర తోపులాటలు,  గొడవలు కామన్​ అయ్యాయి. దీంతో జనాలను కట్టడి చేసేందుకు బస్​స్టేషన్ల వద్ద ఆర్టీసీ సిబ్బందితో పాటు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు.

డ్యూటీలతో డిపో సిబ్బందికి చుక్కలు

ఆర్టీసీ బస్టాండ్లు దసరా, సంక్రాంతి లేదంటే మేడారం జాతర సమయాల్లో రష్‍ గా ఉంటాయి. ఆ సమయాల్లో తప్పితే ఆర్టీసీ సిబ్బందికి పెద్దగా చెప్పుకునేంత ఇబ్బందులుండవు. కాగా, మహాలక్ష్మి స్కీం మొదలైన శనివారం నుంచి కిందిస్థాయి సిబ్బందే కాకుండా డిపో మేనేజర్లు, రీజియన్‍ మేనేజర్ల స్థాయి అధికారులు సైతం డిపోల్లో ఫ్లాట్‍ఫామ్‍ల వద్ద గైడ్‍ చేస్తూ బిజీగా ఉంటున్నారు. మరో రెండు నెలల్లో మేడారం సమ్మక్క–సారక్క జాతర ఉన్న నేపథ్యంలో భక్తులు ఇప్పటినుంచే వేములవాడ, కొండగట్టు తదితర దేవస్థానాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రావడంతో ఆర్టీసీ సిబ్బందికి ప్రతిరోజూ మేడారం జాతర డ్యూటీలే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ఒకేరోజు వరంగల్​లో 2.26 లక్షల జీరో టిక్కెట్లు

వరంగల్‍ రీజియన్‍ పరిధిలో 9 డిపోలుండగా మహాలక్ష్మి స్కీం ప్రారంభించిన శనివారం..అధికారులకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం మహిళా ప్యాసింజర్లకు ఉచిత జర్నీ రూపంలో 94,128 జీరో టిక్కెట్లు కొట్టారు. ఆదివారం 2,26,645  మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేశారు. ఇందులో హనుమకొండ డిపో నుంచి 44,777 మంది, వరంగల్‍ –1 డిపో నుంచి 19,067, వరంగల్‍ –2 డిపో 20,175 (మొత్తం 39,242), జనగామ 31,670, నర్సంపేట 29,505, పరకాల 26,054, మహబూబాబాద్‍ 19,133, భూపాలపల్లి 18,536, తొర్రూర్‍ డిపో నుంచి 17,728 మంది మహిళా ప్యాసింజర్లు జీరో టిక్కెట్‍ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. గతంలో ఇలాంటి రోజుల్లో మహిళల ప్రయాణించే సంఖ్య లక్ష వరకు ఉండగా ఇప్పుడు రెండు లక్షలు దాటుతోంది.  

మహాలక్ష్మితో.. ఒక్కసారిగా ప్యాసింజర్లు పెరిగిన్రు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి స్కీంతో ఆర్టీసీ బస్సులకు ఫుల్లు డిమాండ్‍ వచ్చింది. ఈ పథకం కింద ఉచిత ప్రయాణం చేసే మహిళా ప్యాసింజర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. మొదటి రెండు రోజుల్లో డిపోలు ప్రయాణికులతో నిండాయి. సంక్రాంతి, మేడారం జాతరలు తప్పిస్తే గతంలో ఎప్పుడు లేనంత రద్దీ పెరిగింది. కేవలం జీరో టిక్కెట్లే 2 లక్షలకు పైచిలుకు కొట్టాం. అందుబాటులో ఉన్న సిబ్బందితో 24 గంటలు బెస్ట్ సర్వీస్‍ ఇస్తున్నాం.

 శ్రీలత, ఆర్టీసీ వరంగల్‍ రీజియన్‍ మేనేజర్‍