అంచనాలు భారమై.. ఆటకు దూరమై!

అంచనాలు భారమై.. ఆటకు దూరమై!
  • విమెన్స్‌‌ ఆల్‌‌రౌండ్‌‌ ఫైనల్‌‌ నుంచి కూడా బైల్స్‌‌ విత్‌‌డ్రా
  •  మిగతా ఈవెంట్లపై సస్పెన్స్‌‌!

టోక్యో: ఎప్పడూ అద్భుత ఆటతో.. కళ్లు చెదిరే విన్యాసాలతో..  రికార్డులు కొల్లగొడుతూ అందుకున్న పతకాలతో వార్తల్లో నిలిచే అమెరికా స్టార్‌‌ జిమ్నాస్ట్‌‌ సిమోన్‌‌ బైల్స్‌‌ ఇప్పుడు అసలు పోటీకే దూరంగా ఆడి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మెంటల్‌‌ హెల్త్‌‌ ఇష్యూస్‌‌ కారణంగా ఆర్టిస్టిక్‌‌ జిమ్నాస్టిక్స్‌‌  విమెన్స్‌‌ టీమ్‌‌ ఫైనల్‌‌ మధ్యలో పోటీ నుంచి తప్పుకున్న ఆమె తాజాగా గురువారం జరిగే ఆల్‌‌రౌండ్‌‌ కాంపిటీషన్‌‌ ఫైనల్‌‌ నుంచి విత్‌‌డ్రా అయింది. ఈ విషయాన్ని యూఎస్‌‌ఏ జిమ్నాస్టిక్స్‌‌ కన్ఫామ్‌‌ చేసింది. వచ్చే వారం జరిగే మిగతా ఇండివిడ్యువల్‌‌ ఫైనల్స్‌‌లో బైల్స్‌‌ బరిలోకి దిగేది లేనిది అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం  ఉంటుందని తెలిపింది.  రియో గేమ్స్‌‌ ఆల్‌‌రౌండ్‌‌ ఈవెంట్‌‌లో సిమోన్‌‌ గోల్డ్‌‌ గెలిచింది. టోక్యో గేమ్స్‌‌లో క్వాలిఫికేషన్‌‌ రౌండ్‌‌లో తొమ్మిదో ప్లేస్‌‌లో నిలిచిన జేడ్‌‌ క్యారీ.. బైల్స్‌‌ ప్లేస్‌‌లో ఆల్‌‌రౌండ్‌‌ ఫైనల్లో పోటీ పడనుంది. రియోలో ఐదు మెడల్స్‌‌ నెగ్గిన సిమోన్‌‌..  టోక్యోలో ఆరు ఈవెంట్లలో ఫైనల్స్‌‌కు క్వాలిఫై అయ్యింది. ఇప్పటికే రెండు పోటీల నుంచి తప్పుకోవడంతో ఈ మెగా గేమ్స్‌‌లో ఐదు గోల్డ్‌‌ మెడల్స్‌‌ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి జిమ్నాస్ట్‌‌గా నిలవాలనుకున్న  బైల్స్‌‌ కల చెదిరింది.  అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు మెడల్‌‌ కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమని బైల్స్‌‌ భావిస్తోంది. ఇక, బైల్స్‌‌ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు గౌరవించారు. ఆమెకు మద్దతు ప్రకటించారు. ఒలింపిక్స్‌‌లో  మెంటల్‌‌ హెల్త్‌‌ ఇష్యూస్‌‌తో బాధపడే అథ్లెట్లకు సాయం అందించేందుకు 70 భాషల్లో 24/7 హెల్ప్‌‌లైన్ అందుబాటులో ఉంచినట్టు ఐఓసీ చెప్పింది. ​ 

మెరుపులు మళ్లీ చూస్తామా? 
లెజెండరీ స్విమ్మర్‌‌ మైకేల్‌‌ ఫెల్ఫ్స్‌‌,  స్ర్పింట్‌‌ గ్రేట్‌‌ఉసేన్‌‌ బోల్ట్‌‌ రిటైరవ్వడంతో  24 ఏళ్ల  సిమోన్‌‌ బైల్స్‌‌ను టోక్యో ఒలింపిక్స్‌‌కు ముఖచిత్రంగా భావించారు. దాంతో, బైల్స్‌‌పై భారీగా అంచనాలు పెరిగాయి.  ఇది బైల్స్‌‌కు మోయలేని బరువు అయింది. ఆమె ఆటపై ప్రభావం చూపింది. అందుకే ఈ ప్రపంచం భారం మొత్తాన్ని తన భుజాలపై మోస్తున్నట్టు అనిపిస్తోందని సోషల్‌‌ మీడి యాలో సోమవారం ఓ పోస్ట్‌‌ చేసింది. ఆ తర్వాత  టీమ్​ ఫైనల్స్​ నుంచి వైదొలిగిన ఆమె ఆల్‌‌రౌండ్‌‌ ఈవెంట్‌‌లో టైటిల్‌‌ నిలబెట్టుకునేందుకైనా  బరిలోకి దిగుతుందని ఆశించిన ఫ్యాన్స్‌‌కు షాకిచ్చింది. బైల్స్‌‌ ఇలా మానసిక ఒత్తిడికి లోనవ్వడం ఇదే తొలిసారి కాదు. 2013లో జరిగిన యూఎస్‌‌ క్లాసిక్‌‌ టోర్నీలో ఇలానే తడబడింది. అప్పటికి ఆమె వయసు16 ఏళ్లు.  కానీ, ఇప్పుడు సిమోన్‌‌ వయసు 24 ఏళ్లు. వయసుతో పాటు అనుభవం పెరిగింది. తనకు ఏది మంచిదో, తన కోసం ఏం చేయాలో ఆమెకు తెలుసు. అందుకే ఆటకంటే జీవితం గొప్ప అంటోంది. మెడల్‌‌ కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యం అని చెబుతోంది. దాంతో, మిగతా నాలుగు ఫైనల్స్‌‌లో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌‌తో పాటు కెరీర్​లో ఆమె ఆఖరాట ఆడినట్టే అన్న అభిప్రాయాలూ వస్తున్నాయి.