డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను అదనపు కట్నం కోసం అత్తామామలు ఏకంగా 10 నెలలపాటు గదిలోని టాయిలెట్లో బంధించారు. తినడానికి కేవలం పచ్చి బియ్యం, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి మాత్రమే ఇచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి, రాహుల్‌కు రెండేళ్ల క్రితం వివాహం కాగా, గతేడాది ఫిబ్రవరిలో వీరికి కవల పిల్లలు జన్మించారు. రాహుల్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండటంతో బాధితురాలు డెహ్రాడూన్‌లోని అత్తమామల ఇంట్లోనే ఉంటోంది.
అయితే, గతేడాది జూలై నుంచి ఆమెను గదికే పరిమితం చేశారు. లీవ్‌పై భర్త ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమెను విపరీతంగా కొట్టేవాడు. పైపులు, ఇనుప రాడ్లు, వైర్లతో విచక్షణారహితంగా కొట్టడంతో పాటు బాటిళ్లు, కర్రలతో ప్రైవేట్ భాగాలపై దాడి చేశారు. జుట్టు పీకేయడంతో ఆమె తల గుండులా మారిపోయింది. ఈ వేధింపుల వల్ల ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతింది.
ఈ విషయాలు బయటపడతాయనే ఉద్దేశంతో బాధితురాలిని పుట్టింటి వారితో ఫోన్ లో మాట్లాడనివ్వకుండా, మనవళ్లను చూపించకుండా దాచేశారు. ఎప్పుడు ఫోన్ చేసినా స్నానం చేస్తోందని అబద్ధాలు చెప్పేవారని బాధితురాలి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. బాధితురాలి తండ్రి బహుగుణ ఫిర్యాదుతో సెలకుయ్ పోలీసులు.. భర్త రాహుల్ ఖండూరి, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.
