V6 News

బెంగళూరులో  లవ్ ప్రపోజ్ చేస్తానంటూ..ప్రియుడిని కుర్చీకి కట్టేసి తగలబెట్టింది

బెంగళూరులో  లవ్ ప్రపోజ్ చేస్తానంటూ..ప్రియుడిని కుర్చీకి కట్టేసి తగలబెట్టింది
  • తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే కక్షతో యువతి దారుణం
  • కర్నాటకలోని బెంగళూరులో ఘటన 

బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువతి సరికొత్తగా లవ్ ప్రపోజ్ చేస్తానంటూ తన ప్రియుడిని కుర్చీకి కట్టేసి తగలబెట్టేసింది. లవర్ మంటల్లో కాలిపోతుంటే ఆమె తన మొబైల్ ఫోన్‌‌‌‌లో వీడియో రికార్డ్ చేసింది. పోలీసుల ప్రకారం..ప్రేరణ, కిరణ్ (ఇద్దరి వయస్సు 27 ఏండ్లు) ఒక టెలికాం స్టోర్‌‌‌‌లో జాబ్ చేస్తున్నారు. వీరిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, కొంతకాలంగా కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని ప్రేరణ భావించింది. అతనిపై తీవ్ర కోపం పెంచుకుంది. ఆ కోపంతో కిరణ్‌‌‌‌ను చంపాలని పక్కాగా ప్లాన్ వేసింది.

పథకంలో భాగంగా మంగళవారం దక్షిణ బెంగళూరులోని అంజనాపురలో ఉన్న తన ఇంటికి కిరణ్‌‌‌‌ను ప్రేరణ పిలిచింది. కిరణ్ వచ్చిన తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం, ఒక వీడియో రికార్డ్ చేస్తూ ఒక సరికొత్త ‘ప్రపోజల్’ సర్​ ప్రైజ్​ ఇస్తానని ప్రేరణ నమ్మబలికింది. విదేశీ పద్ధతిలో వినూత్నంగా లవ్ ప్రపోజ్ చేస్తానని చెప్పి.. కిరణ్ కళ్లకు గంతలు కట్టింది. అతన్ని కుర్చీపై కూర్చోబెట్టి కదలకుండా గట్టిగా తాడుతో బంధించింది. కిరణ్ కుర్చీకి కట్టేయొద్దు అని అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఇది ఒక లేటెస్ట్ స్టైల్ అంటూ నమ్మించింది. కుర్చీకి కట్టేసిన తర్వాత.. కిరోసిన్​ కిరణ్‌‌‌‌పై పోసి నిప్పు అంటించింది.

కళ్లు కనిపించక.. కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో కిరణ్ తప్పించుకోలేక మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఇదంతా ప్రేరణ తన మొబైల్ ఫోన్‌‌‌‌లో రికార్డ్ చేసింది. తొలుత ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ.. పోలీసుల విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు ప్రేరణను అదుపులోకి తీసుకుని ఆమెపై మర్డర్ కేసు నమోదు చేశారు. కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే కక్షతోనే అతన్ని చంపినట్లు నిందితురాలు అంగీకరించిందని పోలీసులు పేర్కొన్నారు.