మహిళ దారుణ హత్య: డెడ్ బాడీని తగలబెట్టి, ఆభరణాలతో దుండగులు పరార్​

మహిళ దారుణ హత్య: డెడ్ బాడీని తగలబెట్టి, ఆభరణాలతో దుండగులు పరార్​
  • మేడ్చల్ జిల్లా అత్వెల్లిలో దారుణం

మేడ్చల్, వెలుగు: మేడ్చల్ జిల్లాలోని అత్వెల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా బాలానగర్‌‌‌‌కు చెందిన దాసరి లలిత (50) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా గొంతు, చెవులు, ముక్కు కోసి హత్య చేశారు. ఆపై శవాన్ని ఉంటున్న ఇంటిలోనే తగలబెట్టారు. పోలీసుల ప్రకారం..లలిత నాలుగు నెలల క్రితం జీవనోపాధి కోసం అత్వెల్లికి వచ్చి, రేకుల షెడ్డులో కిరాయికి ఉంటున్నది. 

స్థానిక వైన్‌‌‌‌షాప్‌‌‌‌లో స్వీపర్‌‌‌‌గా పనిచేస్తున్నది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె ఉంటున్న షెడ్డు నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి రేకుల షెడ్డులోకి వెళ్లి చూడగా..లలిత మృతదేహం కాలిపోయి ఉంది.  దుండగులు హత్య చేసి, శవానికి నిప్పు అంటించారు. దాంతో పోలీసులు, క్లూస్ టీమ్‌‌‌‌తో కలిసి ఆధారాలు సేకరించారు. సగం కాలిన మృతదేహాన్ని పోస్ట్‌‌‌‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ, సీఐలు పరిశీలించారు. 

లలితకు బాగా తెలిసిన వ్యక్తులే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఆమె చెవి, ముక్కు, గొంతు కోసి, కొన్ని ఆభరణాలను కూడా తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో  తేలింది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని డీసీపీ కోటిరెడ్డి పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌‌‌‌లు, స్థానికుల సమాచారం ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.