- తెల్లవారేసరికి చెరువులో మృతదేహం
- మేడిపల్లిలో మిస్టరీగా మారిన ఘటన
మేడిపల్లి, వెలుగు: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ శంకర్‌నగర్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అర్ధరాత్రి నగ్నంగా వీధుల్లో పరుగులు తీసిన సదరు యువతి.. కొద్దిసేపటికే సమీపంలోని ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆమె మృతదేహం పీర్జాదిగూడ చెరువులో తేలియాడుతూ కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా దేవుపల్లి గ్రామానికి చెందిన వక్కలగడ్డ తేజస్విని(25) తన తల్లి అరుణతో కలిసి శంకర్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. గతంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన తేజస్విని, ఇటీవల తల్లితో కలిసి ఇక్కడికి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తేజస్విని తన తల్లి ఇంట్లో ఉండగానే బయట నుంచి తాళం వేసి, నగ్నంగా రోడ్డుపైకి వచ్చింది. అనంతరం సమీపంలోని ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని, చీరను ఎత్తుకెళ్లింది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే పీర్జాదిగూడ చెరువులో తేజస్విని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆలయ విగ్రహం కోసం డీఆర్ఎఫ్ బృందాలతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.
అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు..
ఘటనపై తల్లి అరుణ మాట్లాడుతూ ఆరు నెలలుగా తనకు, తన కుమార్తెకు పీడకలలు వస్తున్నాయని, కలల్లో రక్తం కనిపిస్తున్నట్లు అనిపించేదని పోలీసులకు తెలిపింది. అయితే, ఇంట్లో తల్లీకూతుళ్లతోపాటు మరికొందరు కలిసి క్షుద్ర పూజలు నిర్వహించారని, ఆ తర్వాతే యువతి నగ్నంగా గుడిలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని, చీరను ఎత్తుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
