డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కలెక్టరేట్ ముట్టడి

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కలెక్టరేట్ ముట్టడి
  • కరీంనగర్​లో ఆందోళన,భారీగా తరలివచ్చిన పేదలు
  • పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట
  • సొమ్మసిల్లి పడిపోయిన పలువురు మహిళలు

కరీంనగర్, వెలుగు: డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం జిల్లాలోని పేదలు కరీంనగర్ కలెక్టరేట్​ను సోమవారం ముట్టడించారు. వందలాది మంది తరలివచ్చి, కలెక్టరేట్ గేటులోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్రూమ్ పోరాట సమితి కన్వీనర్, బీజేపీ నేత పొల్సాని సుగుణాకర్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన ముట్టడి కార్యక్రమం దాదాపు గంటన్నరపాటు సాగింది. జనం భారీగా చేరుకుంటుండటంతో పోలీసులు కలెక్టరేట్ గేట్లు మూసి ఎవరినీ లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలు గేట్ల నుంచి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు మహిళలు సొమ్మసిల్లి కిందపడిపోయారు. పరిస్థితి చేయిదాటే ప్రమాదముందని పోలీసులు కలెక్టర్​కు సమాచారమిచ్చారు.

దీంతో అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, సిబ్బందితో వచ్చి నిరసనకారులతో మాట్లాడారు. అక్కడే వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అడిషనల్ కలెక్టర్ కాళ్లపై పడి తమకు ఉండేందుకు ఇల్లు లేదని, మంజూరు చేయాలని వేడుకున్నారు. అనంతరం ఆందోళనను విరమించారు. ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని 2014 ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని సుగుణాకర్ రావు ప్రశ్నించారు. బీజేపీ నేతలు కన్నబోయిన ఓదెలు,  లింగంపల్లి శంకర్, బేతి మహేందర్ రెడ్డి, నర్సింగోజు రామకృష్ణ, వెంకట్ రెడ్డి, భాషవేణి మల్లేశం, దుర్గం మారుతి, అమర్​నాథ్,  గడ్డం నాగరాజు, మొలుగురి కిషోర్, కల్లపెళ్లి అశోక్, సొన్నాకుల శ్రీనివాస్, బాషబోయిన ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.