మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సూచించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీల్లో రూ.40 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.
అలాగే 900 మంది మైనారిటీ నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం స్వచ్ఛంద సంస్థ నిర్మించిన మూడు చింతలపల్లి ఎమ్మార్వో కార్యాలయ నూతన భవనం, మేడ్చల్ మండల తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు రిజర్వేషన్ కోటాలో పోటీ చేసి రాజకీయ పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు.
