చేవెళ్ల సెగ్మెంట్.. డిసైడ్ చేసేది ఆడవాళ్లే..

చేవెళ్ల సెగ్మెంట్.. డిసైడ్ చేసేది ఆడవాళ్లే..

రంగారెడ్డి, వెలుగు:చేవెళ్ల లోక్ సభ స్థానాన్ని మహిళా ఓటర్లు తీవ్రంగా ప్రభావితం చేయనున్నారు . ఒకరకంగా చెప్పాలంటే అభ్యర్థి గెలుపు వీరి ఓట్లపైనే ఆధారపడి ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‍ సరళి దీన్నే రూఢీ చేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.  ఈ క్రమంలో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు మహిళా ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం  చేశారు. రాష్ట్రంలోని 41 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అందులో చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని తాండూర్‌ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికం. చేవెళ్ల, వికారాబాద్‌ , పరిగి అసెంబ్లీ పరిధిలో పురుషులు, మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. మహిళా ఓట్లే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచార సరళి సాగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 23,02,163 మంది ఓటర్లు ఉన్నారు . ప్రస్తుత జాబితాలో ఈ సంఖ్య 24,15,598కు చేరింది. అంటే 1,13,435 మంది అదనంగా ఓటర్‍ లిస్టులో చేరారన్నమాట. ఇందులోనూ మహిళలు 57,697 మంది, పురుషులు 55,710 మంది, ఇతరులు 28 మంది ఉన్నట్లు అధికారులు వివరించారు. నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు పార్లమెంట్‌  పరిధిలోని మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాలు ఉన్నాయి. తాండూర్‌ నియోజకవర్గంలో పురుషుల కంటే 4307 మహిళ ఓటర్లే అధికంగా ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ పెద్దగా వ్యత్యాసం కన్పిం చడం లేదు.

గత ఎన్నికల్లో63.99శాతం పోలింగ్‌

గత లోక్ సభ ఎన్నికల్లో 63.99 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలైన ఓట్లలో పురుషులు 61 శాతంగా, మహిళలు 66శాతంగా నమోదయ్యాయి. తాజాగా వచ్చిన దరఖాస్తులలోనూ మహిళలదే పై చేయిగా ఉంది. గ్రామీణ  ప్రాంతాల్లో మహిళా ఓటర్లే కీలకం కావడంతో వారే నిర్ణయాత్మక పాత్రను పోషించనున్నారు. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో మహిళా ఓటర్లు ఉండడంతో అన్ని పార్టీల నాయకులు మహిళలపై  ప్రత్యేకంగా దృష్టి సారించారు.