దళితబంధు మీటింగుకు వెళ్తూ గాయపడిన మహిళ మృతి

దళితబంధు మీటింగుకు వెళ్తూ గాయపడిన మహిళ మృతి
  • డెడ్​బాడీతో హుజూరాబాద్​లో మృతురాలి బంధువుల ఆందోళన

హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్​బై ఎలక్షన్స్​కు ముందు జరిగిన దళితబంధు మీటింగుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో మహిళ మృతి చెందింది. ప్రభుత్వ మీటింగుకు వెళ్తూ గాయపడితే కేసీఆర్​ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని డెడ్​బాడీతో మృతురాలి బంధువులు సోమవారం రాత్రి హుజూరాబాద్​లో ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ పార్టీ లీడర్లు అక్టోబర్ 26న శాలపల్లి గ్రామానికి చెందిన 20 మంది మహిళలను దళిత బంధు మీటింగుకు అని చెప్పి తీసుకెళ్లారు. రాజపల్లి శివారులో మహిళలు ప్రయాణిస్తున్న ఆటో ట్రాలీని వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మహిళలు గాయపడ్డారు. 18 మందిని హుటాహుటిన హనుకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా రెండు రోజులకు నెల్లి స్వరూప అనే మహిళ మృతి చెందింది. అధికార పార్టీ లీడర్లు బాధితులను సరిగా పట్టించుకోలేదనే ఆరోపణలు రావడంతో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ లక్ష్మీకాంతరావు, టీఆర్ఎస్​అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​పూర్తిస్థాయిలో ఆదుకుంటామని, మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ తమకు ఆరోగ్యశ్రీ ద్వారా మాత్రమే ట్రీట్​మెంట్​చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆదివారం సాయంత్రం అదే ప్రమాదంలో గాయపడిన వంతడుపుల రాజేశ్వరి మృతి చెందగా ఫార్మాలిటీస్ పూర్తిచేసి సోమవారం బంధువులకు డెడ్​బాడీ అప్పగించారు. గాయపడిన మరో మహిళ చనిపోయినా టీఆర్ఎస్​ లీడర్లలో చలనం లేదని, ఆదుకుంటామని చెప్పి లీడర్లు పట్టించుకోవట్లేదని డెడ్​బాడీతో మృతురాలి బంధువులు సోమవారం రాత్రి హుజూరాబాద్ సూపర్​బజార్ చౌరస్తాలో ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని వారికి సర్దిచెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని బాధితులు డిమాండ్​ చేశారు.