వడోదరా: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ అదరగొట్టింది. ఛేజింగ్‌లో కెప్టెన్ స్మృతి మంధాన (41 బాల్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87), జార్జియా వోల్ (54 బాల్స్‌లో 14 ఫోర్లతో 79) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ఢిల్లీ వరుసగా నాలుగో ఫైనల్లో ఓడటం గమనార్హం. టాస్ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 203/4 స్కోరు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (37 బాల్స్‌లో 8 ఫోర్లతో 57), లారా వోల్‌వర్ట్ (25 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), చినెల్లీ హెన్రీ (15 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) చెలరేగారు. తర్వాత బెంగళూరు 19.4 ఓవర్లలో 204/4 స్కోరు చేసి నెగ్గింది. స్మృతికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఏక కాలంలో ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ టైటిళ్లను గెలిచిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. మ్యాచ్‌కు ముందు డబ్ల్యూపీఎల్ క్లోజింగ్ సెర్మనీ అట్టహాసంగా జరిగింది.
టాప్ లేపారు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి మెరుగైన ఆరంభం లభించింది. షెఫాలీ వర్మ (20) ఫోర్‌తో ఖాతా తెరవగా, లిజెల్లీ లీ దడదడలాడించింది. మూడో ఓవర్‌లో రెండు సిక్సర్లతో బ్యాట్ ఝుళిపించింది. వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబడుతూనే సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసింది. ఆరో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన షెఫాలీని ఐదో బాల్‌కు అరుంధతి (1/40) వెనక్కి పంపింది. దాంతో తొలి వికెట్‌కు 49 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. లారా తొలి బాల్‌ను ఫోర్‌గా మలిచి టచ్‌లోకి వచ్చింది. పవర్‌ప్లేలో ఢిల్లీ 53/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌లో లిజెల్లీ 4, 4, 6 దంచగా, లారా ఫోర్ రాబట్టింది. అయితే 8వ ఓవర్‌లో లిజెల్లీ ఔట్ చేసిన డిక్లెర్క్ (1/48) రెండో వికెట్‌కు 23 రన్స్ భాగస్వామ్యాన్ని విడదీసింది. 72/2 వద్ద వచ్చిన జెమీమా కీలక ఇన్నింగ్స్ ఆడింది. మూడు ఫోర్లతో బ్యాట్‌కు పని చెప్పడంతో ఫస్ట్ టెన్‌లో ఢిల్లీ 94/2తో నిలిచింది. లారా సింగిల్స్‌తో ముందుకెళ్లగా 12వ ఓవర్‌లో జెమీమా మూడు ఫోర్లతో హోరెత్తించింది. 14వ ఓవర్‌లో మరో ఫోర్ కొట్టిన జెమీమా 32 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసింది. కానీ 16వ ఓవర్‌లో సయాలీ (1/46) దెబ్బకు వికెట్ ఇచ్చుకోవడంతో మూడో వికెట్‌కు 76 రన్స్ జతయ్యాయి. చివర్లో చినెల్లీ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడింది. లారాతో కలిసి నాలుగో వికెట్‌కు 55 రన్స్ చేయడంతో ఢిల్లీ మంచి టార్గెట్‌ను నిర్దేశించింది.
స్మృతి మెరుపులు..
ఛేజింగ్‌లో రెండో ఓవర్‌లోనే గ్రేస్ హారిస్ (9) ఔట్‌తో బెంగళూరు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కానీ స్మృతి మంధాన, జార్జియా.. డీసీ బౌలర్లను దంచికొట్టారు. పవర్‌ప్లేలో 59/1 స్కోరు చేసి శుభారంభాన్నిచ్చారు. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా డీసీ బౌలింగ్ మెరుగుపడలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న మంధాన 23 బాల్స్‌లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని చేసింది. జార్జియా 37 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టింది. అదే జోరుతో రెండో వికెట్‌కు 92 బాల్స్‌లోనే 165 రన్స్ జత చేశారు. 9 బాల్స్ తేడాలో జార్జియా, రిచా ఘోష్ (6), మంధాన ఔట్ కావడంతో బెంగళూరు ఇబ్బందుల్లో పడింది. 8 బాల్స్‌లో 13 రన్స్ చేయాల్సిన డిక్లెర్క్ (7 నాటౌట్) నిలకడగా ఆడినా.. రాధా యాదవ్ (12 నాటౌట్) క్యాచ్‌ను మిన్ను మణి వదిలేసింది. ఇక 4 బాల్స్‌లో 8 రన్స్ చేయాల్సిన దశలో రాధా వరుసగా రెండు ఫోర్లు కొట్టి ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 203/4 (జెమీమా 57, లారా 44, అరుంధతి 1/40). బెంగళూరు: 19.4 ఓవర్లలో 204/4 (స్మృతి 87, జార్జియా 79, హెన్రీ 2/34).
