స్లోగా యాదాద్రి పనులు

స్లోగా యాదాద్రి పనులు

మూడు నెలల్లో పూర్తిచేయాలన్న సీఎం

నిధుల విడుదలలో ఆలస్యం

బ్రహ్మోత్సవాల నాటికి పూర్తవడం కష్టమే

మొదటిసారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనర్సింహఆలయాన్ని పునర్ నిర్మించాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటీడీఏ) ఏర్పాటు చేయడంతో-పాటు రూ. 2 వేల కోట్లు కేటాయించారు. పక్కనేపెద్ద గుట్టతోపాటు ఆలయం దిగువన మరో 250ఎకరాలు సేకరించారు. 2016 ఏప్రిల్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో స్వామివారిని ప్రతిష్ఠించారు. 14.11 ఎకరాల విస్తీర్ణం లోనియాదాద్రి కొండపై 2.33 ఎకరాలు ప్రధానాలయవిస్తరణకు కేటాయించారు.

నవంబరు 2016లోఆలయ పనులు ప్రారంభించారు. దాదాపుమూడేళ్లు కావస్తోంది. ఇప్పటివరకు రూ. 692కోట్లు విడుదల చేశారు. సీఎం కేసీఆర్ 11 సార్లుయాదాద్రికి వచ్చారు. వచ్చిన ప్రతిసారి ఆలయనిర్మాణం ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఉన్నా రు. కానీ నిధుల విడుదలలో జాప్యంకారణంగా పనుల్లో వేగం మాత్రం పెరగడం లేదు.గత నెల 17న వచ్చిన కేసీఆర్ ఆలయ నిర్మాణాని-కి ఇంకా ఐదేళ్లు కావాలా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే రెండు, మూడు నెలల్లోనే పనులు పూర్తికావాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోజరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా మహా సుదర్శనయాగం నిర్వహిస్తామని ప్రకటిం చారు. వెంటనేరూ. 50 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటిం చారు.ఆ తర్వాత మరో రూ.452 కోట్లు విడుదల చేస్తామనిప్రకటిం చారు. ఆయన వచ్చి నెల గడిచిపోయింది.విడుదల చేస్తానని చెప్పిన రూ. 50 కోట్లే ఇప్పటివర-కు రాలేదని తెలుస్తోంది. ఆలయ పనుల్లో కూడా గతనెల, ఇప్పటికీ పెద్దగా తేడా ఏమీ లేదు.

పూర్తి కావాల్సిన పనులివే…

ప్రధాన ఆలయంతోపాటు చుట్టూ ఏర్పాటు చేసే శిల్పాలకు సంబంధించి 75 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. గర్భాలయంలో స్వామి ఎదురుగా శిల్పాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గర్భాలయంలో మెట్ల ఏర్పాటుతోపాటు అనేక పనులు  జరుగుతున్నాయి. ఆలయం పూర్తయిన తర్వాత ఏసీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆలయం చుట్టూ ఫ్లోరింగ్​ ఏర్పాటు చేయలేదు. ఆలయం ముందువైపు మూసి వేయడంతో పాటు ఉత్తరం వైపున మండపాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

ప్రధాన ఆలయానికి అభిముఖంగా నిర్మిస్తున్న శివాలయం కూడా 75 శాతం పూర్తయింది.  నవగ్రహాలు, యాగశాల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇటీవల కురిసిన వర్షానికి శివాలయంలో చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోయింది. అక్కడే కొత్తగా నిర్మించిన రామాలయాన్ని తొలగించాలని కేసీఆర్​ సూచించడంతో తొలగిస్తున్నారు.

కొండపై చుట్టూరా రిటర్నింగ్​ వాల్​50 శాతం మాత్రమే పూర్తయింది. అండర్​గ్రౌండ్​డ్రైనేజీ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రధాన ఆలయంలో కొంతభాగం డ్రైనేజీ పూర్తయింది. వెలుపలి భాగంలో  ప్రారంభించిన డ్రైనేజీ పనులు శివాలయం వరకు మాత్రమే సాగుతున్నాయి.  ఆ తరువాత పనులు ప్రారంభం కాలేదు.

ఆలయ అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉంటుందన్న ఉద్దేశంతో భక్తులు స్నానమాచరించే పుష్కరిణిని పూడ్చివేశారు. అదేచోట మళ్లీ నిర్మిస్తామని చెబుతున్నారు. దీనికి సంబంధించి పనులు ప్రారంభం కాలేదు. సత్యనారాయణ వ్రతాలు, కల్యాణకట్టకు సంబంధించి నిర్మించిన భవన సముదాయం స్లాబ్​ పనులు పూర్తయ్యాయి.

కొండపైకి భక్తులు చేరుకోవడానికి మెట్ల మార్గం ఏర్పాటుకు ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిపివేశారు. అదేవిధంగా స్వామివారిని భక్తులు ఎటువైపు నుంచి చేరుకోవాలన్న విషయంలోనూ ఇంకా స్పష్టత లేదు.

భక్తుల కోసం వాటర్​ ట్యాంక్​ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న వాటర్​ట్యాంక్​ను కూల్చివేసి దాని స్థానంలోనే  ఎత్తుగా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

ముఖ్యమైన విద్యుత్​ పనులు ఇంకా ప్రారంభించలేదు. ఆలయ పనులు పూర్తయితే కానీ తాము పనులు చేపట్టలేమని విద్యుత్​ పనులకు సంబంధించిన వాళ్లు చెప్పినట్టు తెలుస్తోంది. కొండపై విద్యుత్​ అవసరాల కోసం 132 కేవీ, 33 కేవీ సబ్​స్టేషన్లు​ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థం బస్​ స్టేషన్​ ఎక్కడ నిర్మించాలన్న అంశంపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ప్రధాన ఆలయం పూర్తయిన తర్వాత స్వామివారికి పూజలు చేయడం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాలాలయాన్ని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ స్వామివారు పూజలందుకున్న స్థలం కాబట్టి ఇక్కడ మరో నిర్మాణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.