గోవర్ధనగిరిధారిగా యాదగిరీశుడు..సింహవాహనంపై ఊరేగిన నరసింహస్వామి

గోవర్ధనగిరిధారిగా యాదగిరీశుడు..సింహవాహనంపై ఊరేగిన నరసింహస్వామి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం స్వామివారు గోవర్ధనగిరిధారి అలంకారంలో, రాత్రి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఎడమ చేతి చిటికెన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి, కుడిచేతితో పిల్లనగ్రోవి పట్టుకుని స్వామివారు కనిపించడంతో భక్తులు తన్మయత్వం పొందారు. ముత్యాల హారాలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు నగలతో లక్ష్మీసమేత నారసింహుడు ప్రధాన ఆలయ తిరువీధుల్లో విహరిస్తూ ధగధగ మెరిశారు. సాయంత్రం నిత్యారాధనల అనంతరం స్వామివారిని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి, రాత్రి 7 గంటలకు సింహవాహనంపై ఊరేగించారు. తూర్పు ద్వారం ఎదుట స్వామివారిని అధిష్టింపజేసి నారాయణుడి అవతార లీలలను ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు భక్తులకు వివరించారు. ఉత్సవాల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భవానీ శంకర్, చైర్మన్ నర్సింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు, మహేశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 24న  ఎదుర్కోలు మహోత్సవం..

బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు స్వామివారు ‘జగన్మోహిని’ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటలకు ‘అశ్వవాహనం’పై ఊరేగింపు అనంతరం లక్ష్మీనరసింహుల ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు.