మాట వినకుంటే బుల్లెట్ దించుతం..సీఎం వార్నింగ్

మాట వినకుంటే బుల్లెట్ దించుతం..సీఎం వార్నింగ్

కన్వరియాల(శివభక్తుల)పై దాడి చేస్తే పోలీసు తూటాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ హెచ్చరించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం  బాదార్​పూర్​ ఏరియాలో యోగి ఈ కామెంట్స్ చేశారు. కన్వర్​ యాత్రలో భాగంగా కాలినడకన వెళుతున్న కన్వరియాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని ప్రస్తావిస్తూ.. వారిపై దాడులు చేయొద్దని హెచ్చరించారు. మాటలతో వినకుంటే తూటాలకు పనిచెప్పాల్సి వస్తుందని వార్నింగ్​ ఇచ్చారు. చట్టానికి లోబడి ఎవరైనా సరే తమ తమ పండుగలను వేడుకగా జరుపుకోవచ్చని యోగి అన్నారు. కానీ శివభక్తులపై చేయివేసినా, అల్లర్లకు పాల్పడాలని చూసినా ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ప్రజల సాధారణ జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చేందుకే షాహీన్​ బాగ్ లో కొంతమంది​నిరసనలు జరుగుతున్నాయని యోగి ఆరోపించారు. షాహీన్​ బాగ్​ ప్రొటెస్టర్ల అసలు ఉద్దేశం ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకించడం, రామజన్మభూమిపై కోర్టు తీర్పును వ్యతిరేకించడమేనని ఆయన వివరించారు. జమ్మూకాశ్మీర్​కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తే పాకిస్తాన్​తోపాటు కేజ్రీవాల్ కూడా బాధపడ్డారని ఆరోపించారు. షాహీన్​బాగ్​నిరసనలు.. శాంతి, సాధారణ జీవితాన్ని భంగపరిచేందుకు చేస్తున్న హానికరమైన ప్రయత్నాలని మండిపడ్డారు. ఒకవైపు అభివృద్ధి, నేషనలిజం కోసం నరేంద్ర మోడీ నాయకత్వానికి, మరోవైపు విభజన శక్తులకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, కేజ్రీవాల్​కు మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.

యోగిపై ఈసీకి ఆప్ లెటర్

ఢిల్లీలోని షాహీన్​బాగ్​లో జరుగుతున్న ప్రొటెస్టులపై రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్​ను ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా బ్యాన్ విధించాలని విజ్ఞప్తి చేసింది. యోగిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆప్ నేత సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.