
నోయిడాలో పర్యటిస్తే సీఎం పదవి కోల్పోతారనే మూఢనమ్మకాన్ని యోగి ఆదిత్యనాథ్ ఛేదించారు. పోయిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా సీఎం బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి సీఎం కాబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అతిపెద్ద ఇండస్ట్రియల్ సిటీ నోయిడాలో పర్యటించిన సీఎం ఎవరైనా మరోసారి అధికారంలోకి రాలేరనే మూఢనమ్మకం ప్రచారంలో ఉంది. పలుసార్లు అదే జరిగింది కూడా. అక్కడ పర్యటిస్తే సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టే అవకాశం రాదనే భయంతో కల్యాణ్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ నోయిడాకు దూరంగానే ఉన్నారు. అయినా వాళ్లకు ఓటమి తప్పలేదు. ఇక, ఈ మూఢనమ్మకాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ పట్టించుకోలేదు. పలుసార్లు అక్కడ పర్యటించారు. ఈ ఏడాది జనవరిలో కరోనాపై రివ్యూ చేయడానికి ఆయన నోయిడాకు చివరిసారిగా వెళ్లారు. దీంతో మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ మూఢనమ్మకాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. సీఎం పదవిలో ఉన్నవాళ్లు నోయిడాకు వెళ్తే ఎన్నికల్లో ఓడిపోతారని, యోగికి కూడా పరాజయం తప్పదని కామెంట్స్ చేశారు. ఈ మూఢనమ్మకాలను పటాపంచలు చేస్తూ యూపీలో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, 1980ల్లో నోయిడాలో పర్యటించిన తరువాత సీఎంలు వీర్ బహదూర్ సింగ్, ఎన్డీ తివారి పదవులు కోల్పోయారు.