మల్హోత్రా మ్యాజిక్‌‌‌‌‌‌‌‌.. బంగ్లాపై యంగ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ

మల్హోత్రా మ్యాజిక్‌‌‌‌‌‌‌‌.. బంగ్లాపై యంగ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ

బులవాయో (జింబాబ్వే): అండర్-19 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో యంగ్ ఇండియా వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. ఓటమి ఖాయం అనుకున్న దశలో స్పిన్నర్ విహాన్ మల్హోత్రా (4/14) చేసిన మ్యాజిక్‌‌‌‌‌‌‌‌తో శనివారం జరిగిన  గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 18 రన్స్ తేడాతో (డక్‌‌‌‌‌‌‌‌వర్త్ లూయిస్) బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 49 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా 48.4 ఓవర్లలో 238 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 

అభిజ్ఞాన్‌‌‌‌‌‌‌‌ కుందు (112 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 80), యంగ్‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (67 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72) సత్తా చాటారు. బంగ్లాదేశ్ పేసర్ అల్ ఫహాద్ (5/38) ధాటికి  కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఆయుష్​ మాత్రే (6), వేదాంత్ (0), విహాన్ (7), హర్వాన్ష్‌‌‌‌‌‌‌‌ (2), అంబరీష్ (5) పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టినా.. వైభవ్‌‌‌‌‌‌‌‌, కుందు జట్టును ఆదుకున్నారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 17.2 ఓవర్లకు 90/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో వర్షం వచ్చి గ్రౌండ్ చిత్తడిగా మారడంతో ఆట ఆగింది. 

దాంతో బంగ్లా టార్గెట్‌‌‌‌‌‌‌‌ను 29 ఓవర్లలో 165 రన్స్‌‌‌‌‌‌‌‌ గా సవరించారు. ఆట తిరిగి మొదలయ్యాక ఇండియా బౌలర్లు అద్భుత పెర్ఫామెన్స్ చేశారు. ఫిఫ్టీ పూర్తి చేసుకొని జోరు మీదున్న అజిజుల్ హకీం (51)ను ఔట్ చేసిన ఖిలాన్ పటేల్ కీలక బ్రేక్ ఇవ్వగా.. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో మల్హోత్రా ధాటికి సిద్దిఖీ (15), జిబాన్ (7) రిజాన్ (15), సుమియున్ (2) పెవిలియన్ బాట పట్టడంతో బంగ్లా 28.3 ఓవర్లలో 146 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటై ఓడిపోయింది. విహాన్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది.  కాగా, టాస్ సమయంలో ఇండియా, బంగ్లా కెప్టెన్లు షేక్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చుకోలేదు. కానీ, మ్యాచ్ ముగిశాక ఇరు దేశాల ప్లేయర్లు  చేతులు కలిపారు. శనివారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా.. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనుంది.