విషాదం: రోడ్డుపైనే కుప్ప‌కూలి యువ‌కుడి మృతి

విషాదం: రోడ్డుపైనే కుప్ప‌కూలి యువ‌కుడి మృతి

దగ్గరికెళ్లేందుకు భయపడ్డ‌ స్ధానికులు

హైదరాబాద్ లోని కాప్రా సర్కిల్‌ ఈసీఐఎల్ చౌరస్తాలో విషాదం చోటు చేసుకుంది. ఒక యువకుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ రోడ్డుపైనే అందరూ చూస్తుండగా కుప్పకూలిపడిపోయాడు. ఆ చుట్టూ ప‌క్క‌ల మనుషులున్నా.. క‌రోనా భ‌యంతో అతడ్ని ఆదుకునేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేకపోయారు. అంబులెన్స్ వచ్చే లోపు ఆ యువకుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు వదిలాడు.

జ‌వ‌హర్ న‌గ‌ర్ కు చెందిన‌‌ పృథ్వీరాజ్… గ‌త మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అక్క‌డి వైద్య సిబ్బంది క‌రోనా ల‌క్ష‌ణాలున్నాయ‌ని అనుమానం వ్య‌క్తం చేస్తూ.. కిమ్స్ హాస్పిటల్ కి తరలించాలని సూచించారు. కిమ్స్ కు వెళ్లేందుకు బయటకు వచ్చిన ఆ యువకుడ్ని కుటుంబ స‌భ్యులు తరలించే క్రమంలో అందరూ చూస్తుండగానే రోడ్డుపై ఒక్కసారిగా పడిపోయాడు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే అతడు చనిపోయాడని చెప్పడంతో.. అత‌ని కుటుంబ స‌భ్యులు గుండెలవిసేలా రోదించారు. కరోనా భయం నేపథ్యంలో అత‌నికి సాయం చేసేందుకు అక్కడున్న వారెవ‌రూ సాహసించలేకపోయారు.