- జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో ఘటన
- పోయినచోటే సంపాదించుకోవాలని అప్పులు మీద అప్పులు చేసిన యువకుడు
- అప్పులు భారీగా పెరగడంతో ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య
జగిత్యాల టౌన్, వెలుగు: బెట్టింగ్ యాప్‌కు మరోయువకుడు బలయ్యాడు. బెట్టింగ్ యాప్‌లో గేమ్స్ ఆడుతూ రూ.25 లక్షలు పొగొట్టుకొని, అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గర్వందుల మహేశ్ (37) గీత కార్మికుడిగా పనిచేస్తూ.. భార్య జమున, ఇద్దరు ఆడ పిల్లలను పోషించుకుంటున్నాడు. ఏడాది నుంచి బెట్టింగ్ యాప్స్‌కు బానిసై, అందులో తరుచూ గేమ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. పోగొట్టుకున్న డబ్బులను ఎలాగైనా తిరిగి సంపాదించాలని తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి, బెట్టింగ్ యాప్‌లో పెట్టేవాడు. ఆ డబ్బులు కూడా మహేశ్ పోగొట్టుకున్నాడు. దీంతో అప్పులు సుమారు రూ.25 లక్షలకు పెరిగాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమలో బుధవారం రాత్రి గ్రామ శివారులోని రైతు వేదిక వద్దకు వెళ్లి, ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఫోన్ చూడొద్దన్నందుకుబాలుడి ఆత్మహత్య.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఘటన
జూబ్లీహిల్స్, వెలుగు: ఫోన్ చూడొద్దని మందలించినందుకు బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని సయ్యద్ నగర్‌లో ఇర్ఫాన్ ఖాన్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని కుమారుడు మహమ్మద్ అపాన్ ఖాన్ (12) సమీపంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్నాడు. గత కొంతకాలంగా అపాన్ మొబైల్ ఫోన్‌లోనే ఎక్కువసేపు గడుపుతూ, చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
ఈ క్రమంలో ఫోన్ ఎక్కువ చూడవద్దని కుమారుని మందలించారు. అనంతరం సమీప బంధువు మరణించడంతో ఇర్ఫాన్ ఖాన్ తన భార్యతో కలిసి మంగళవాంర అంత్యక్రియలకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అపాన్ తన గదిలోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. అంత్యక్రియల నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కుమారుడు గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
