సికింద్రాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పైలెట్ కావాలన్న ఆ యువతి కలలను చిదిమేస్తూ.. తోటి సిబ్బంది అత్యాచారం చేసిన ఈ ఘటన నగరంలో కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే. బేగంపేటలోని ఏవికన్స్ పైలెట్ శిక్షణ సంస్థలో పైలెట్ కోర్సు నేర్చుకుంటున్న ఒక యువతిపై అదే సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్ కన్నేశాడు. శిక్షణ పేరుతో జనవరి 2025 నుంచి ఆ యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ దారుణాలను ఫోటోలు, వీడియోలు తీసి.. వాటిని చూపించి బాధితురాలిని పదే పదే బెదిరిస్తూ నరకం చూపించాడు.
ఈ ఘటనలో నసిముద్దీన్‌కు దమ్మాయిగూడకు చెందిన మరో ఇన్‌స్ట్రక్టర్ సల్మాన్ పూర్తిస్థాయిలో సహకరించడం గమనార్హం. ఒకే సంస్థలో పనిచేస్తూ, విద్యార్థినికి అండగా ఉండాల్సిన వీరు.. క్రూరంగా వ్యవహరించి ఆమె జీవితంతో ఆడుకున్నారు. నరరూప రాక్షసుల వేధింపులు భరించలేక బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడు నసిముద్దీన్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సల్మాన్ పాత్రపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
