హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన తేజస్వి వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, ఆయన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు గాంధీ భవన్ ఎదుట ధర్నా చేశారు. తేజస్వి దిష్టిబొమ్మను దహనం చేసి బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివ చరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తేజస్వి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే ఇక్కడి బీజేపీ ఎంపీలను రోడ్లపై తిరగనివ్వమని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.

