ఫిలింనగర్ లో యువకుడు మృతి
హైదరాబాద్,వెలుగు: ఫిలింనగర్ లో ఓ యువకుడి అనుమానాస్పద మృతి కీలక మలుపు తిరిగింది. ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ ఫేజ్–3లో జరిగిన ఘటనలో బిల్డింగ్ పై నుంచి పడి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే…..ఫిల్మ్ నగర్ కు చెందిన ప్రేమ్ సాగర్(20), సత్యానంద్(21) స్నేహితులు. ఈ ఇద్దరు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం కూకట్ పల్లిలో బోనాల జాతరకి వెళ్లారు. అక్కడే మందు,గంజాయి తాగి ఎంజాయ్ చేశారు. ఆ తరువాత రాత్రి ఒంటి గంట సమయంలో మద్యం మత్తులోనే ఫిలింనగర్ బయలుదేరారు. మార్గం మధ్యలో ప్రేమ్ సాగర్ ముగ్గురి స్నేహితల బైక్ రోడ్డు ప్రమాదానికి గురైంది.
గాయపడ్డ ఫ్రెండ్స్ ను ప్రేమ్ సాగర్, సత్యానంద్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంటికి పంపారు. ఆ తర్వాత ప్రేమ్ సాగర్, సత్యనంద్ కలిసి డీవీఎస్ ఎన్ క్లేవ్ కి వెళ్లారు. సత్యానంద్ కు దొంగతనాలు చేసే అలవాటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు అపార్ట్ మెంట్ లోని 3 వ అంతస్థుకు వెళ్లారు. అక్కడినుంచి మొదట ప్రేమ్ సాగర్ ఓ గోడ ఎక్కాడు. మత్తులో ఉన్నందున కాలు జారి క్రింద పడ్డాడు.
ఆ గోడ 3 వ అంతస్థులో ఉన్నందున ప్రేమ్ సాగర్ కు తీవ్ర గాయాలయ్యాయి . అపార్ట్ మెంట్ లో పడ్డ ప్రేమ్ సాగర్ ను ఆ అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గమనించి బయటకు తీసుకువచ్చాడు. అంబులెన్స్ వచ్చేలోపే ప్రేమ్ సాగర్ ప్రాణాలు విడిచాడు. దీంతో అలర్ట్ అయిన సత్యానంద్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. కేసు దర్యాప్తు చేసిన బంజారాహిల్స్ పోలీసులు చోరీ కోసం వచ్చి 3 వ అంతస్థు నుంచి పడి చనిపోయినట్లు గుర్తించారు. వాచ్ మెన్ స్టేట్ మెంట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
