‘ర్ర్.... రింగ్ ఇన్ఫోబెల్స్’ ఈ సిగ్నేచర్ ట్యూన్ చాలామంది వినే ఉంటారు. ఇది ఇన్ఫోబెల్స్ ఛానెల్ వీడియోల ముందు వచ్చే ఇంట్రో. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పిల్లలకి ఈ ఛానెల్ అంటే తెగ ఇష్టం. అందుకు నిదర్శనం ఈ వీడియోలకు వచ్చే కొన్ని వందల మిలియన్ల వ్యూస్. భార్యాభర్తలు కుబేర్ నటరాజన్, జయలక్ష్మి ఇన్ఫోబెల్స్ని రన్ చేస్తున్నారు. ఒక్క భాషతో మొదలైన వీళ్ల యూట్యూబ్ జర్నీ ఇప్పుడు ఏడు భాషలకు విస్తరించింది.
నటరాజన్ ‘ఇన్ఫోబెల్స్ ఇంటరాక్టివ్ సొల్యూషన్స్’ అనే కంపెనీని 2009లో పెట్టాడు. దాని ద్వారా ఇండియన్ పిల్లల కోసం ఏడు యూట్యూబ్ ఛానెళ్లు నడుపుతున్నారు ఇప్పుడు. ఈ ఛానెళ్లలో రంగురంగుల యానిమేషన్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. వీడియోల్లో చక్కని మ్యూజిక్, అందరికీ అర్థమయ్యే ప్రాంతీయ భాషల్లో మాటలు పిల్లల్ని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా క్రియేటివిటీ, నాలెడ్జ్ పెంచే వీడియోలు ఎక్కువగా అప్లోడ్ చేస్తుంటారు. ఈ వీడియోలు ఎంటర్టైనింగ్గా ఉండడంతో పిల్లలకు బాగా నచ్చుతున్నాయి.
మోరల్ మెసేజ్
పిల్లలు ఫోన్ పట్టుకుంటే తల్లిదండ్రులు ‘వద్ద’ని చెప్తుంటారు. కానీ.. ఫోన్లో ఇన్ఫోబెల్స్ వీడియోలు చూస్తే మాత్రం ‘నో’ చెప్పరు. దానికి కారణం.. ఆ ఛానెల్స్‌లో వచ్చే వీడియోల్లో ఎంటర్టైన్మెంట్తో పాటు మోరల్ మెసేజ్ ఉండడమే. అది కూడా చిన్నపిల్లలకు ఈజీగా అర్థమయ్యేలా. “మా వీడియోల ద్వారా పిల్లలు, తల్లిదండ్రులకు మధ్య అనుబంధాన్ని పెంచాలి. పిల్లలకు ఎంటర్టైన్మెంట్తోపాటు ఎడ్యుకేషన్ అందించాలి అనుకున్నాం. అనుకున్నట్టే మా లక్ష్యాన్ని చేరుకున్నాం. వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది టీమ్ ఎఫర్ట్ వల్లే సాధ్యమైంది. ముఖ్యంగా నా భార్య జయలక్ష్మి సంస్థకు క్రియేటివ్ హెడ్‌గా ఉండి బాగా సపోర్ట్ చేస్తుంది” అన్నారు ఫౌండర్ నటరాజన్.
ఎలాంటి వీడియోలు?
ఇన్ఫోబెల్స్ యూట్యూబ్ ఛానెల్స్‌లోని వీడియోలు ఎడ్యుటైన్మెంట్(ఎడ్యుకేషన్ + ఎంటర్టైన్మెంట్) కాన్సెప్ట్‌తో క్రియేట్ చేస్తుంటారు. ముఖ్యంగా జానపద కథలు, రైమ్స్, నీతి కథలు ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉంటాయి. అవి కూడా షార్ట్‌గా ఉండడంతో పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు. ఈ వీడియోల నిడివి మూడు నిమిషాల కంటే తక్కువే. కొన్ని స్టోరీలు ఎపిసోడ్స్‌గా రిలీజ్ చేస్తున్నారు. వీటిలో చిన్న పిల్లలు చేసే సాహసాలను చూపిస్తుంటారు.
ఛానెల్స్ అన్నింటికి కలిపి142 మిలియన్లకు పైగా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. వాటిలో ఇంగ్లీష్ వీడియోలు అప్లోడ్ చేసే ‘ఇన్ఫోబెల్స్’ మెయిన్ ఛానెల్‌ని 13.6 మిలియన్ల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. దీన్ని 2011లో మొదలుపెట్టారు. ఆ తర్వాత మిగతా ఛానెల్స్ పెట్టారు. ఇన్ఫోబెల్స్-– హిందీ 48, తమిళం 27.5, తెలుగు 26.8, కన్నడ12.3, బంగ్లా13.9 మిలియన్ల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. మలయాళంలో కూడా ఛానెల్ నడుపుతున్నారు. దీనికి లక్షా 86 వేల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. బిలియన్ వ్యూస్ దాటిన వీడియోలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని వీడియోలు హిందీ, తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, బంగ్లా భాషల్లో డబ్ చేస్తున్నారు.
ఇండియన్ కల్చర్
ఇన్ఫోబెల్స్లో వచ్చే చాలా వీడియోల్లో ఇండియన్ కల్చర్ కనిపిస్తుంది. యానిమేషన్ బొమ్మలకు మన కల్చర్‌కు దగ్గరగా ఉండే బట్టలే డిజైన్ చేస్తుంటారు. ప్రతి ఛానెల్లో ఆ ప్రాంతంలో ఎక్కువగా వినిపించే రైమ్స్పై వీడియోలు చేస్తుంటారు. డబ్ చేసిన వీడియోల్లో కూడా భాష ఫర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రాస, యాసలో లోపాలు లేకుండా జాగ్రత్తపడతారు. అందుకే పిల్లలు చాలా ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. వీళ్లు చేసిన ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ చిన్ను అండ్ క్రేజీ పప్పు’లోని చిన్ను, చిట్టి, పప్పు, లాలాజీ క్యారెక్టర్స్ పిల్లలను బాగా ఆకట్టుకుంటున్నాయి.
డీవీడీలతో మొదలు...
కుబేర్ నటరాజన్ మద్రాస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. చదువుకుంటున్న రోజుల్లోనే డిజిటల్ మార్కెటింగ్, యానిమేషన్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. చదువు పూర్తయ్యాక బెంగళూరులో సెటిల్ అయ్యాడు. అక్కడ పదహారేండ్లు ఉండడంతో కన్నడ పట్ల అభిమానం పెరిగింది. అందుకే 3డీ క్యారెక్టర్ యానిమేటెడ్ కన్నడ రైమ్స్ వీడియోలు చేశాడు. ఆ డీవీడీలకు మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ చేసిన మూడు నెలల్లోనే ఆ డీవీడీ పది వేల కుటుంబాలకు చేరింది.
ఆ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో కర్ణాటక జానపద కథలు, పాటలతో “నమూర కిన్నర జోగి” పేరుతో మరో డీవీడీని మార్కెట్లోకి తెచ్చాడు. ఇది రెండు వాల్యూమ్స్‌లో వచ్చింది. ఇది 8వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్–2013కి కూడా ఎంపికైంది. ఆ తర్వాత తమిళంలో కూడా 3డీ యానిమేటెడ్ రైమ్స్ ‘‘కణ్మణి’’ని తీసుకొచ్చాడు. అది కూడా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో కూడా సక్సెస్ అయ్యాడు. భార్య జయలక్ష్మి ఈ జర్నీలో ఎప్పుడూ కుబేర్‌కు తోడుంటుంది. నడిపించింది.
