గురువారం నుంచి పాదయాత్ర కంటిన్యూ: షర్మిల

గురువారం నుంచి పాదయాత్ర కంటిన్యూ: షర్మిల

వైఎస్సార్టీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తమపై దాడులు చేస్తూ అక్రమ అరెస్ట్లులు చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని..ఆయన ఇచ్చిన హామీలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడం తప్పా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం తాలిబన్ల దేశమా అని నిలదీశారు.

సిటీలో లా అండ్ ఆర్డర్  సృష్టించిందే పోలీసులు అన్నారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా తమ కార్యకర్తలను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పోలీసులు బూటు కాళ్లతో ఇష్టంవచ్చినట్టు తన్నారని చెప్పారు. తెలంగాణ పోలీసులు..టీఆర్ఎస్ పోలీసులుగా మారిపోయారని ఆరోపించారు. టీఆర్ఎస్ బందిపోట్ల పార్టీగా మారిందని చెప్పారు. కాళేశ్వరంలో 70 వేల కోట్ల అవినీతి జరిగిందని..రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని పేర్కొన్నారు. గురువారం నుంచి తన పాదయాత్ర కంటిన్యూ చేస్తానని చెప్పారు. 

శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే టీఆర్ఎస్ నేతలు అడుగు అడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రను అడ్డుకునేందుకు ఫ్లెక్సీలు తగలబెడుతూ తనపై కావాలనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నర్సంపేటలో టీఆర్ఎస్ గూండాలు కావాలనే బస్సును కాల్చివేశారని చెప్పారు. అంతటితో ఆగకుండా బస్సు అద్దాలు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారన్నారు. ఇనుప రాడ్లతో తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసి ఇష్టమొచ్చినట్టు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు లేరని...వారిని బయటకు పంపించివేశారని చెప్పారు. 

లోటస్ పాండ్ లో షర్మిలకు ఘన స్వాగతం 

నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో  లోటస్ పాండ్ కు వచ్చిన షర్మిలకు ఘన స్వాగతం లభించింది. వైఎస్సార్టీపీ కార్యకర్తలు, అభిమానులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. మహిళలు అయితే హారతి ఇచ్చి స్వాగతం పలికారు.