24 గంటల కరెంట్పై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తుండు : వైఎస్ షర్మిల

24 గంటల  కరెంట్పై కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తుండు : వైఎస్ షర్మిల
  •  రాష్ట్రంలో ఎక్కడా జాడలేని 24 గంటల కరెంట్
  •  దొర కంటికి కనపడని సబ్ స్టేషన్ల ముందు ఆందోళనలు
  • చంద్రబాబును గుర్తు చేస్తున్న కేసీఆర్ కరెంట్ కోతలు
  •  రాష్ట్రంలో దిక్కులేదు... దేశమంతా ఇస్తడంట


రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెప్తోందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. 24 గంటల విద్యుత్ విషయంలో  కేసీఆర్, మంత్రులు చెప్పిన దానికి, వాస్తవ పరిస్థితికి పొంతనలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదన్న షర్మిల... ఇందుకు రైతుల ధర్నాలే నిదర్శనమని అన్నారు. వ్యవసాయానికి కనీసం 7 గంటల పాటు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ రైతులు సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఓవైపు కరెంట్ కోసం అన్నదాతలు ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

ఎండుతున్న పంటలు

నిరంతర విద్యుత్ హామీతో రాష్ట్రంలో రైతన్నలు 50 లక్షల ఎకరాల్లో సాగు చేశారని వైఎస్ షర్మిల తెలిపారు.  ఇందులో 30 లక్షల ఎకరాల్లో వరి, మరో 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 7 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 2 లక్షల ఎకరాల్లో ఇతర అంతరపంటలను సాగు చేస్తున్నారని వెల్లడించారు. కానీ కరెంట్ కోతలతో ఈ పంటలన్నీ ఎండిపోయే దశకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే ఐదారు గంటల కరెంట్ తో చివరి మడి వరకు నీళ్లు అందక పంటలు ఎండిపోతుంటే రైతులు విలవిల్లాడుతున్నారని వాపోయారు. కరెంట్ సరఫరా విషయంలో ప్రభుత్వ వాలకం చూస్తుంటే  రైతుల మీద కక్ష తీర్చుకునేందుకే పంటలను ఎండబెతున్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు పాలన గుర్తు చేస్తున్న కేసీఆర్ తీరు

కేసీఆర్ ప్రభుత్వ తీరు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును గుర్తుకు తెస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయానికి కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు జరిగాయని.. ఆ రోజు వైఎస్సార్ పాదయాత్ర చేసి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ హాయాంలోనూ ఇలాగే జరుగుతోందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడం చేతకాదు కానీ...దేశం మొత్తంలో తెలంగాణ పాలసీని అమలు చేస్తా అని గప్పాలు కొడుతున్నడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తీరు చూస్తుంటే.. కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తా అన్నట్లు ఉందని చురకలంటించారు.