షర్మిల సంతోషం..కోమటిరెడ్డి స్వాగతం.. వైఎస్సార్టీపీ విలీన ప్రశ్నలపై దాటవేత

షర్మిల సంతోషం..కోమటిరెడ్డి స్వాగతం.. వైఎస్సార్టీపీ విలీన ప్రశ్నలపై దాటవేత

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం ముహూర్తానికి వేళయిందా..? అతి త్వరలో వైఎస్సార్టీపీని వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందా..? ఈ మేరకు రెండు పార్టీల మధ్య విలీనంపై అవగాహన కుదరిందా..? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా  వినిపిస్తోంది. 

షర్మిల ముఖంలో సంతోషం..

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపి ఆగస్టు 11వ తేదీ సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే విలీన ప్రక్రియపై విలేఖర్లు ప్రశ్నించగా..షర్మిల ఎలాంటి సమాధానం చెప్పలేదు. పదే పదే విలీనం గురించి రిపోర్టర్లు ప్రశ్నిస్తే..షర్మిల నవ్వుతూనే ఉండిపోయారు. చాలా మంది చాలా ప్రశ్నలు వేసినా..షర్మిలకు ఎలాంటి కోపం రాలేదు. విలీనంపై ఖండించనూలేదు.  పైగా సంతోషంతో ఉన్నట్లు నవ్వారు.  ఓపికగా ఉండాలి..ఓపికగా ఉండాలని మాత్రమే అన్నారు. దీంతో కాంగ్రెస్ లో వైఎస్సాఆర్టీపీ విలీన ప్రక్రియ ఖాయమైంది..అతి త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందనే వార్తలకు మరింత బలం చేకూరింది. 

 కోమటిరెడ్డి వ్యాఖ్యలు..

ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం ఢిల్లీ నుండి వైఎస్ షర్మిలతో పాటు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వైఎస్సార్ టీపీని  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా అని రిపోర్టర్లు కోమటిరెడ్డిని ప్రశ్నించారు. ఈ  ప్రశ్నకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని అన్నారు.  కాబట్టి ఆయన కూతురు పార్టీలోకి వస్తానంటే కచ్చితంగా స్వాగతిస్తామని చెప్పారు. చెల్లమ్మ షర్మిల, తాను ఒకే ఫ్లైట్ లో వచ్చామని..రాజకీయాలేవి మాట్లాడలేదన్నారు. కాకపోతే కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ  విలీనం సంగతి షర్మిలను  అడిగితే బాగుంటుంది అని కోమటిరెడ్డి తెలిపారు. 

షర్మిల తన పార్టీని విలీనం చేస్తున్నట్లు ఈ మధ్య కాలంలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ విలీనానికి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు షర్మిలకు మధ్య రాయబారిగా కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వ్యవహరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ.. ఇటీవల షర్మిల  శివకుమార్ తో కూడా భేటీ అయ్యారు. అయితే ఇటీవలే బెంగుళూరు వెళ్లిన షర్మిల..అక్కడి నుంచి 
ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో  కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. పార్టీ విలీనంపై వీరిద్దరితో తొలి దశ చర్చలు నిర్వహించారట. వీరిద్దరితో భేటి అనంతరం పార్టీ విలీనంపై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయట.  ఈ నేపథ్యంలో ఈ వారంలోనే  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసేందుకు  సిద్ధమయ్యారని టాక్. ఇందుకు సంబంధించి ఇప్పటికే కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను ఆమె తీసుకున్నట్టు తెలుస్తోంది. విలీనం అయ్యాక పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.  కాంగ్రెస్ లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు, షర్మిల కోరిక మేరకు తెలంగాణలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.