నీళ్లు కేసీఆర్ ఫామ్​హౌస్‌కి.. నిధులు కేసీఆర్ ఇంటికి

నీళ్లు కేసీఆర్ ఫామ్​హౌస్‌కి.. నిధులు కేసీఆర్ ఇంటికి

మునుగోడు, వెలుగు: ‘‘పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. కానీ ఒక్క ఏడాదిలోనే రూ.30 పెంచారు” అని వైఎస్సార్ టీపీ చీఫ్ ​వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. పెట్రో రేట్లను పెంచినట్లు నిరూపిస్తే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఆమె పాదయాత్ర 20వ రోజు సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని రావిగూడెం నుంచి ప్రారంభమై చిట్యాల మండలంలోని ఎలికట్టె క్రాస్ రోడ్డు వరకు సాగింది. మునుగోడు మండలంలోని రత్తుపల్లిలో షర్మిల మాటముచ్చట కార్యక్రమం నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ‘‘రెండుసార్లు కేసీఆర్ చేతిలో పాలన పెట్టారు. కానీ, ఒక్క సమస్యనైనా కేసీఆర్ పరిష్కరించలేదు. ఏడేండ్ల పాలనలో ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నెరవేర్చలేదు” అని షర్మిల విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులు హమాలీలుగా, ఆటో డ్రైవర్లుగా, కల్లు గీసుకుంటూ, కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకేనా కేసీఆర్ ను సీఎం చేసిందని ప్రశ్నించారు. ‘‘నీళ్లు కేసీఆర్ ఫామ్​హౌస్ కి.. నిధులు కేసీఆర్ ఇంటికి.. నియామకాలు కేసీఆర్ కుటుంబానికే పోయాయి. ఆయన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఉండాలి. కానీ సామాన్యుల ఇంట్లో ఒక్కరికైనా ఉద్యోగం వద్దా?” అని ప్రశ్నించారు. 

ఉద్యోగాలిస్తం.. పంటలు కొంటం..

అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగ నోటిఫికేషన్లపైనే పెడతానని షర్మిల హామీ ఇచ్చారు. రైతులు పండించే ప్రతి పంటను మద్దతు ధరకు కొంటామని, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, ఇంట్లో అర్హులైన వృద్ధులందరికీ పింఛన్లు ఇస్తామని, పేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. రైతులు పండించే పంటను చివరి గింజా వరకు కొంటామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు వరి పండించవద్దని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు.