V6 News

ఏడేండ్ల న్యాయ పోరాటంతోదక్కిన పునరావాస సొమ్ము

ఏడేండ్ల న్యాయ పోరాటంతోదక్కిన పునరావాస సొమ్ము
  • మల్లన్నసాగర్​ నిర్వాసితులకు పరిహారం మంజూరు
  • 45 మందికి రూ.12.54 లక్షల చొప్పున జమ
  • ఇంటి స్థలం, వడ్డీ సంగతేంటో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • పరిహారం కోసం మరో 400 మంది బాధితుల నిరీక్షణ

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: పరిహారం కోసం ఎదరుచూస్తున్న మల్లన్నసాగర్ నిర్వాసితులైన ఒంటరి మహిళలు, పురుషుల నిరీక్షణకు తెర పడింది. వీరికి కాంగ్రెస్​ ప్రభుత్వం పునరావాస సొమ్ము జమ చేసింది. ఏడేళ్లుగా పోరాడుతున్న 45 మంది నిర్వాసితుల అకౌంట్లలో ఒక్కొక్కరికి రూ.12.54 లక్షలు జమ అయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో నిర్వాసితులైన వీరికి పరిహారం ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు పునరావాస పరిహారం మంజూరు చేస్తూ తీర్పు ఇవ్వడంతో అధికారులు పరిహారాన్ని బాధితుల ఖాతాలో జమ చేశారు. ఒంటరి మహిళలు, పురుషులను కుటుంబాలతో కలిపి చూడకుండా ప్రత్యేకంగా పరిగణించి రూ.12.54 లక్షల పరిహారం, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని వేములఘాట్‌‌‌‌‌‌‌‌కు చెందిన 52 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన 27 మంది 2019లో హైకోర్టును ఆశ్రయించారు.

2023 నవంబరులో కోర్టు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే ప్రభుత్వం చెల్లించకపోవడంతో పలువురు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు విచారించగా 6 వారాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు కాలేదు. ఈ ఏడాది మార్చి 30న హైకోర్టు తిరిగి విచారణ చేపట్టి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా వద్ద ఫైల్ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉందని గుర్తించింది. 15న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఈ నెల 2న ఆదేశాలు జారీ చేసింది. విచారణకు ఒక రోజు ముందు అధికారులు పరిహారం జమ చేశారు.

పరిహారం తీసుకోకుండానే మృతి..

వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల నుంచి మొత్తం 79 మంది ఒంటరి మహిళలు, పురుషులు హైకోర్టులో కేసు వేశారు. కేసు నడుస్తుండగానే వారిలో 34 మంది మృతిచెందగా ప్రస్తుతం 45 మందికే పరిహారం అందింది. వీరిలో చాలామంది పరిహారం రాకపోవడం వల్ల కలిగిన ఆందోళన, మనోవేదనతోనే మృతిచెందారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

400 మంది నిరీక్షణ..

ప్రస్తుతం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలకు చెందిన 45 మందికే పరిహారం అందింది. అయితే 2019 నుంచి వడ్డీ చెల్లించలేదని, ఇంటి స్థలం కూడా ఇవ్వలేదని నిర్వాసితులు చెబుతున్నారు. వీటిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసు విచారణను 17కు వాయిదా వేసింది. ఇదే తరహాలో మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల నుంచి మరో 400 మంది వరకు ఒంటరి మహిళలు, పురుషులు పరిహారం కోసం నిరీక్షిస్తున్నారు.

కోర్టు మాకు న్యాయం చేసింది.. 

మేము ఊరు ఖాళీ చేసే సమయంలో మాకు పరిహారం ఇస్తామని చెప్పారు. తర్వాత ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు తిరిగినా న్యాయం జరుగలేదు. కోర్టును ఆశ్రయించాకే న్యాయం జరిగింది. మాకు ఇంకా 2019 నుంచి వడ్డీ చెల్లించాలి. ఇంటి స్థలం కూడా ఇవ్వాలి.  
- పుల్లయ్యగారి బాలలక్ష్మి, ఒంటరి మహిళ, వేములఘాట్

కోర్టు తీర్పుతో భరోసా..

న్యాయం కోసం సార్ల చుట్టూ తిరిగి అలిసిపోయాము. కోర్టు తీర్పు ద్వారా మాకు న్యాయం జరిగింది. కోర్టు తీర్పు ఎంతో మంది బాధితులకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. ఇకా పరిహారం అందాల్సిన వారందరికీ వెంటనే న్యాయం చేయాలి. పరిహారం దక్కని ఎంతో మంది తీవ్ర ఆవేదనతో ఉన్నారు. -భూమయ్యల సత్తవ్వ, ఒంటరి మహిళ, వేములఘాట్